ఏపీలో కేసీఆర్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏపీకి వస్తే ఘన స్వాగతం పలికే అభిమానులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారిన క్రమంలో పార్టీకి ఏపీలో అడుగుపెట్టేందుకు సరైన అవకాశం దొరికింది. త్వరలోనే ఏపీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. సభ ఎక్కడుంటుంది అంటే?
జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించాలని టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మార్చారో.. అప్పుడే కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని భావించారు. ఈ ఏడాది జనవరి 2న ఏపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే జాతీయ పార్టీ పేరు ప్రకటించిన తర్వాత కేసీఆర్ జాతీయ స్థాయిలో పర్యటించారు గానీ ఏపీకి రాలేదు. కేవలం మహారాష్ట్రపైనే ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఏపీలో అడుగుపెట్టలేదు. అయితే త్వరలోనే ఏపీలో అడుగుపెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ నెల మూడో వారంలో ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకూ ఏపీలో అడుగుపెట్టడానికి కేసీఆర్ కి సరైన యాక్షన్ ప్లాన్ దొరకలేదని, అయితే ఇప్పుడు సరైన అవకాశం దొరికిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అజెండాతో ఐతే గ్రాండ్ ఎంట్రీ ఇస్తే తిరుగుండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల మూడో వారంలో ఏపీలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు, కార్మిక సంఘాలు చేపడుతున్న నిరసనలకు అండగా సంఘీభావం తెలపాలని ఏపీ బీఆర్ఎస్ పార్టీ కమిటీకి పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. ఈ మొదటి సభ ద్వారా కేసీఆర్ ఏపీలో పాగా వేయాలని చూస్తున్నారు. అందుకే మొదటి సభ విజయవంతమవడం కోసం భారీగా ప్రజలను సమీకరించే పనిలో ఏపీ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27న ఉంది.
అయితే ఈ తేదీకి ముందుగానే ఏపీలో సభ నిర్వహించాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇస్తూనే క్యాడర్ లో జోష్ నింపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను సైతం స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలపాలని కేసీఆర్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దానికి కొనసాగింపుగా ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజల్లో పార్టీని తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ కి ఏపీ ప్రజల నుంచి స్పందన ఏ స్థాయిలో వస్తుందో చూడాలి. మరి ఏపీలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.