కర్ణాటకలో ఎన్నికలు అయిపోయినా రాజకీయ వేడి మాత్రం చల్లారటం లేదు. సీఎం ఎవరన్న దానిపై ఓ హై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి కోసం పార్టీ చీలే అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
కర్ణాటకలో రాజకీయాలు నివురు గప్పిన నిప్పులా మారాయి. ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. గత ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితి ఏమీ లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే, 135 సీట్లు ఉన్నా.. ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలు ఉన్నా.. ఓ భయం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్ ఎవరన్న దానిపై చర్చ మొదలైంది.
ఓ వైపు సిద్ధారామయ్య.. మరో వైపు డీకే శివకుమార్ సీఎం పీఠం వైపు ఆశగా చూస్తున్నారు. పీఠం పైకి ఎక్కడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్‌లో చీలికలు వచ్చే పరిస్థితులు లేనప్పటికి భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇద్దరికీ సమ్మతమయ్యే నిర్ణయం తీసుకోకపోతే.. కర్ణాటక కాంగ్రెస్ రెండుగా చీలే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధారామయ్య.. డీకే శివకుమార్ ట్యాప్ క్యాటగిరీ నాయకులుగా ఉన్నారు. సిద్ధారామయ్య కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రిగా చేశారు. ఇక, డీకే శివకుమార్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీలో ఓ కోటరీ ఉంది. వారికంటూ వ్యక్తిగతంగా కొంతమంది ఎమ్మెల్యేల బలం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పోటాపోటీగా సీఎం పదవి కోసం చూస్తున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఓకే అని బయటకు అంటున్నారు. అయితే, ఇది వారు పైకి అంటున్న మాటలే అని.. ఏ మాత్రం అసంతృప్తి కలిగినా వారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కర్ణాటక కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానాన్ని నిప్పుల మీద కూర్చోబెట్టింది. సిద్ధారామయ్య.. డీకే శివకుమార్‌లలో ఎవరికి ఇబ్బంది కలిగినా పార్టీ ఇరకాటంలో పడుతుంది. అంతేకాదు! పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. సిద్ధారామయ్య విషయానికి వస్తే.. పార్టీలో ఆయనకంటూ ఓ గ్రూపు మద్దతు ఉంది. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఆయన మద్దుతుగా ఉన్నారు. అధిష్టానం తనకు కాకుండా డీకేకు సీఎం పదవి ఇస్తే.. సిద్ధారామయ్య హర్ట్ అవుతారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసంతృప్తితో రగిలిపోయే సమయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు పార్టీని ఇబ్బందులో పడేస్తాయి. ఆయన తన మద్దుతుదారులతో పోరాటానికి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే గనుక జరిగితే అది బీజేపీకి మంచి అవకాశంగా మారనుంది. ఒక వేళ డీకే శివకుమార్‌కు అసంతృప్తి కలిగినా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది.
కర్ణాటకలో బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టపోయిందన్న చందాన తయారైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 66 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. మ్యాజిక్ ఫిగర్ అయిన 113 దరి దాపుల్లోకి కూడా రాలేకపోయింది. అయినప్పటికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది. మహారాష్ట్రలో చేసిన పనినే కర్ణాటకలో రిపీట్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సిద్ధారామయ్య.. డీకే శివకుమార్‌లలో ఎవరు అసంతృప్తికి గురైనా వారిని తమ దారిలోకి తెచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తుందని అంటున్నారు. బీజేపీకి 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, జేడీఎస్ 20 సీట్లు కలిపితే 86 అవుతాయి. ఓ 30 మందిని కాంగ్రెస్ పార్టీలోనుంచి లాక్కున్నా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయోచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కోసం బీజేపీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.