కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద జోరుగా బెట్టింగ్ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రైతు.. కాంగ్రెస్ గెలుపుపై రెండెకరాలు పందెం కాశాడు. ఆ వివరాలు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగుణంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా.. జేడీఎస్.. వెనకపడింది. పైగా ఈ ఎన్నికల్లో మాజీ సీఎంలు వెనకంజలో ఉండటం గమనార్హం. రానున్న జనరల్ ఎలక్షన్స్‌కి సెమి ఫైనల్‌గా భావించే ఈ పోరులో.. అందునా దక్షిణాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండటం.. బీజేపీకి మింగుడుపడటం లేదు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూస్తే.. కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తర పోటీ నెలకొంది. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలపై రూ.20 వేల కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్టు నివేదికలు వస్తున్నాయి. తాజాగా, ఓ రైతు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై ధీమాతో తన రెండెకరాల పొలాన్ని పందేం కాస్తు చాటింపు వేశాడు. ఆ వివరాలు..
హొన్నాళి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ గెలుస్తారని, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్యదే విజయమంటూ పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. శాంతనగౌడ గెలుపై నాగణ్ణ అనే వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని పందేం కాశాడు. ఈ విషయంలో ఎవరైనా తనతో పందేం కాస్తారా అంటూ గ్రామంలో దండోరా వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలానే కొండసీమల చామరాజనగర జిల్లాలో పందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో సోమణ్ణ విజయంపై రూ.కోటి వరకు పందేలు కాసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలానే గుండ్లుపేట తాలూకా మల్లయ్యనపుర గ్రామానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి కాంగ్రెస్ గెలుపు మీద ఏకంగా రూ.3 లక్షలు పందెం కాశాడు.
కర్ణాటక 16వ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2615 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో సుమారు రెండు వేల మంది డిపాజిట్లు గల్లంతవుతాయని అంచనా. ప్రముఖ అభ్యర్థుల గెలుపోటములపై నియోజకవర్గాల స్థాయిలో జోరుగా భారీ ఎత్తున పందేలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఈసారి ఎక్కువ మంది స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులు గెలుస్తారన్న అంచనాలు నెలకొనడంతో.. వారిని తమవైపు తిప్పుకోడానికి అధికార, విపక్ష నేతలు ఇప్పటి నుంచే జోరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది. మరి కర్ణాటకలో ఏ పార్టీ విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.