ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకొంది. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం.. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా అంటూ శపథం చేయడం. నందమూరి కుటుంబం ప్రెస్ మీట్ పెట్టడం. వంటి అంశాలను గమనిస్తే ఏపీలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలతో సంబంధంలేని చంద్రబాబు భార్యను దూషించారనేది ఆరోపణ. ఆ విషయాన్ని అధికార పార్టీ వారు కొట్టిపారేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా Jr.యన్సీఆర్ స్పందించాడు.
‘మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. అవి ప్రజా సమస్యలపైనే జరగాలి. అవి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసింది. ఎప్పుడైతే సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో.. ముఖ్యంగా మన ఆడ పడుచులను పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు.
‘స్త్రీ జాతిని గౌరవిచడం అనేది. ఆడవాళ్లు, ఆడజాతిని గౌరవించడం అనేది మన సంస్కృతి. అది మన నవనాడుల్లో, జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయన సంప్రదాయం. మన సంప్రదాయాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా, భద్రంగా అప్పజెప్పాలే కానీ.. దానిని కాల్చేసి, రాబోయే తరాలకు ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకోవడం అది మన తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశ పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్తపడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ Jr.యన్టీఆర్ భావోద్వేగంగా స్పందించాడు. యన్టీఆర్ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.