ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించింది. అయినప్పటికీ ప్రగతి భవన్ లోకి దూసుకువెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించారు.
ఈ విషయమై ప్రగతి భవన్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో జేసీ దివాకర్ రెడ్డిని ఆయన నివాసానికి తరలించారు.