స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశం మొత్తం ఎంతో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండాను ఆవిష్కరించారు. ఈక్రమంలో పలువు పార్టీల అధినేతలు సైతం తమ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జనసేన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైకాపా పార్టీపై విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య ఉద్యమం స్ఫూర్తితోనే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తనకు కులాల గురించి అప్పట్లో తెలిసేది కాదని.. ఒక కులాన్ని వర్గ శత్రువుగా భావించడం సరికాదన్నారు. ఒక్క కులం చూసుకుని రాజకీయం చేసి ఉంటే 2019లోనే జనసేనకు 40 సీట్లు వచ్చి ఉండేవన్నారు. వైకాపా నేతలు.. వాళ్ల భావాలను ప్రజలపై రుద్దడం సరికాదని.. జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థల్ని బలోపేతం చేస్తుందన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో తనకు బాగా తెలుసుని, మభ్యపెట్టే రాజకీయాలపై ప్రజల్లో మార్పు రాకపోతే ఎవరం ఏం చేయలేమని పవన్ వ్యాఖ్యానించారు. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. తాను ఓ కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. రాజకీయ నాయకులు ఓట్లు కోసం కుల, మత రాజకీయలు చేయడం సరికాదన్నారు.
దేశానికి వెన్నెముక భారతీయ సంస్కృతి.. ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ వాస్తవాలు మాత్రమే తాను మాట్లాడతాను అన్నారు. మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన లక్ష్యమని.. రామతీర్థం ఘటనలో ఖండిచాం తప్ప.. రెచ్చ గొట్టలేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మత ప్రస్తావన తీసుకొచ్చే వారిని.. తప్పులు చేసే వారిని జన సైనికులు, నేతలు ముక్త కంఠంతో ఖండించాలన్నారు. పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడినని.. ‘పార్టీ నడపటానికి అర్హత వైఎస్సార్‌సీపీకే ఉందా? మాకు లేదా? ఒక్కసారి జనసేనవైపు చూడమని ప్రజల్ని కోరుతున్నా’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.