ఓ నాయకుడిగా విజయం సాధించాలన్నా.. ప్రజల మనసులో అభిమానం సంపాదించుకోవాలన్నా ఉండాల్సిన ముఖ్య లక్షణం.. జనంలో తిరుగుతూ.. ప్రజల్లో మమేకవుతూ.. వారి బాధలు, ఇబ్బందులు, కష్టాలను తెలుసుకుని.. నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తేనే అనుకున్న ఫలితం దక్కుతుంది. రాజకీయ నేతలకు ఉండాల్సిన మరో ముఖ్యమైన లక్షణం ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతూ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచాన వేస్తూ.. దానికి తగ్గట్టు ముందుకు సాగాలి. అలా కాదని.. తన చుట్టూ చేరి.. భజన చేసే వారి మాటలు నమ్మితే.. తర్వాత నట్టెట మునగాల్సిన పరిస్థితి తప్పదు. ఇప్పుడు ఈ వివరణ అంతా ఎందుకంటే.. తాజాగా ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకు జగన్ తీసుకున్న నిర్ణయం ఏంటి.. ఎందుకంత చర్చ అనే వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయితే ముందుస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికి.. ఆ అవకాశం లేదనే అభిప్రాయం కూడా అంతే బలంగా వినిపిస్తుంది. సరే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. విజయం సాధించడమే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ కూడా ఎన్నికలు సిద్ధం కావాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. ఈ సారి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యమని నేతలకు టార్గెట్ ఇచ్చాడు. మరి దాన్ని చేరుకునే మార్గాలను కూడా ఆయనే రెడీ చేసి.. ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశా నిర్దేశం చేస్తున్నాడు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నేరవేరుస్తూనే.. కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నాడు సీఎం జగన్. మరి క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి.. ప్రభుత్వ పని తీరుపై ప్రజల్లో స్పందన ఏంటి అనే తదితర విషయాలను గురించి తెలుసుకోవడానికిగాను సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టాడు సీఎం జగన్. ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది కార్యకర్తలతో తాను విడిగా భేటీ కావడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆగస్టు 4 నుంచి ఇలాంటి సమావేశాలు జరుగుతాయి.
ఆలోచన మంచిదే.. మరి ఆచరణలో..
క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు స్థానికంగా ఏం జరుగుతోందనే విషయంపై చాలా అవగాహన ఉంటుంది. అక్కడి ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నదనే విషయం కూడా కార్యకర్తలకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అందుకే జగన్ తీసుకున్న నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేరుగా నియోజకవర్గస్థాయి కార్యకర్తలతోనే విడివిడిగా సమావేశం అవుతుండడం పార్టీకి చాలా మేలు చేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇదే సమయంలో కొన్ని అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
కార్యకర్తలు స్థానిక నియోజకవర్గ నేతలతో ఎక్కువగా టచ్‌లో ఉంటారు. వారితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఆయా నియోజకవర్గ నేతల గురించి ఏకంగా సీఎంకే ఫిర్యాదు చేయగలరా.. అసలు ఆ నేతలకు వ్యతిరేకంగా అధిష్టానం దగ్గర మాట్లాడగలరా అంటే.. లేదనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు.. ఇలా జగన్ కార్యకర్తలతో భేటీ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అనే వాదన కూడా తెర మీదకు వస్తుంది.
ఆశించిన ఫలితం రావాలంటే..
జగన్ ప్రయత్నం మంచిదే.. కానీ ఆయన అనుకున్న ఫలితాలు రావాలంటే మాత్రం.. ఇతర పార్టీలకు భిన్నంగా ఈ సమావేశాలు నిర్వహించాలి. కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి వారి సమస్యలు వినాలి. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. పార్టీ పట్ల వారిలో ఉండే ప్రేమను, కమిట్ మెంట్‌ను కాపాడాలి. జగన్ అలా చేయగలిగితేనే.. ఇలా నిర్వహించే సమావేశాలకు సార్థకత అంటున్నారు రాజకీయ విశ్లేషకులు
ఇక ఇప్పటికే జగన్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మంత్రులందరూ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వ పని తీరును.. పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని చెప్పాడు. వారం రోజుల క్రితమే దానిపై ఓ రిపోర్టు కూడా తయారు చేసి.. కార్యక్రమంలో పాల్గొనని వారికి డైరెక్ట్‌గా క్లాస్ తీసుకున్నాడు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా కదలని నేతలు.. ఇప్పుడు కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేయరనే నమ్మకం ఏంటనే వాదన కూడా తెర మీదకు వస్తుంది.
గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన రచ్చబండ వంటి కార్యక్రమాలు నిర్వహించి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి.. వారి సమస్యలు.. ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను తెలుసుకునేవారు. డైరెక్ట్‌గా ప్రజలతో మాట్లాడటం వల్ల క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. 2019 ఎన్నికల ముందు వరకు కూడా జగన్ పాదయాత్ర పేరుతో జనంలోనే ఉన్నాడు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుని దానికి తగ్గట్లు మానిఫెస్టో రూపొందించాడు. కానీ సీఎం అయిన తర్వాత జగన్ ప్రజలు వద్దకు వెళ్లింది లేదు. మరోవైపు విపక్షాలు ప్రభుత్వ పనితీరును ఎండగట్టే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నాయి.
ఇలాంటి సమయంలో జగనే స్వయంగా రంగంలోకి దిగి.. ప్రజల వద్దకు వెళ్తేనో.. లేదంటే కార్యకర్తలతో సమావేశంలో క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి కార్యకర్తలతో సమావేశాలు ఎలా సాగుతాయి.. ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: CM Jagan: MLAలపై సీఎం జగన్ సీరియస్.. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదు!