ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీకి ఇంటిపోరు పెరిగిపోయింది. అధికార- ప్రతిపక్షాల మధ్య పోరు కంటే ఇంట జరుగుతున్న రచ్చే ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంతపార్టీ మీద విమర్శలు, ఆరోపణలు చేయడం చూస్తున్నారు. ఇద్దరూ తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. కోటంరెడ్డి అయితే తాను పార్టీ మారుతున్న విషయాన్ని వెల్లడించారు. అసలు ఈ పరిస్థితులు ఎవరికి లాభం చేకూర్చనున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు ఏపీలో మారుతున్న రాజకీయంతో అధికార పార్టీకి, సీఎం జగన్ కు తీవ్ర నష్టం వాటిల్లబోతోంది అని చాలామంది భావిస్తున్నారు. సొంతపార్టీ నాయకులు, సీనియర్లు రెబల్స్ కావడం పార్టీకి మంచిది కాదని వాదిస్తున్నారు. అయితే ఈ తిరుగుబాటులు, రెబల్స్ వల్ల అధికారపార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉంటే దానిలో అసంతృప్తి ఉండటం సర్వ సాధారణమైన విషయని చెబుతున్నారు. ఎందుకంటే పార్టీ ప్రతి ఒక్క నేతను సంతృప్తి పరచడం కష్టంమని తెలిసిందే. ఒకరో ఇద్దరో అలక పాన్పు ఎక్కడం, రెబల్ గా మారడం ఇప్పటి వరకు చాలాసార్లు చూసిన విషయాలే. దీని వల్ల ప్రత్యేకంగా సీఎం జగన్ కు వచ్చే నష్టం ఏమీ లేదని చెబుతున్నారు.
కానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాత్రం ఈ సంఘటనలు మేలు చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే వాళ్లకు బలమైన కార్యకర్తలు ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఆ కార్యకర్తలు ఎక్కడికీ పోలేదు. కానీ, కేడర్ విషయంలో మాత్రం కాస్త సతమతం అవుతున్నారంటున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీలో ఎంతో గొప్ప నాయకులు, సీనియర్లు ఉండేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లంతా కనుమరుగైపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కార్యకర్తలు ఎంతమంది ఉన్నా పార్టీ నిర్ణయాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ముఖాలు కరువయ్యాయని చెబుతున్నారు.
రాజకీయంగా చంద్రబాబు అనుభవాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎలాంటి పరిస్థితిని అయినా కూడా తనకు అనుకూలంగా మార్చుకోగల సత్తా ఉన్న నాయకుడు. ఇప్పుడు అధికార పార్టీ రెబల్స్ ని తన పార్టీలోకి తీసుకోవడంలో చంద్రబాబు సఫలీకృతుడు అయితే రాజకీయంగా ఒకడుగు ముందుకు వేసినట్లే అంటున్నారు. ఇప్పుడు ఈ వివాదాలతో మీడియాలో బాగా కనిపిస్తున్న నేతలు తమ పార్టీకి ఫేస్ గా మారితే ప్రజలను బాగా ఆకర్షించగలరని చెబుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలాగూ టీడీపీ నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటించారు. ఇలాంటి రెబల్స్ పుట్టికొస్తే చంద్రబాబు కచ్చితంగా లాభపడతారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఒకరు ఇద్దరు నేతలు ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం వల్ల అధికార పార్టీకి పెద్ద నష్టం ఉండదని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.