2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయా? పోటీ చేస్తే సీట్ల పంపకాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తారు? జనసేన, టీడీపీ పొత్తుతో వైఎస్సార్ సీపీకి నష్టం తప్పదా?.. ఏపీ రాజకీయాలపై ఆసక్తి ఉన్న సగటు వ్యక్తిని తొలుస్తున్న ప్రశ్నలివి. అయితే, పొత్తు విషయంలో జనసేన, టీడీపీలు బయటకు పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వకపోయినా.. పొత్తుల విషయం రెండు పార్టీలు ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కలిసి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, రెండు పార్టీలు కలిసి పోటీ చేయటం వల్ల అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీకి ఏ మాత్రం నష్టం వాటిల్లనుంది? అదే సమయంలో పవన్ తీసుకునే నిర్ణయాలు వైఎస్సార్ సీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందా?..
టీడీపీ, జనసేన పార్టీలు 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఆ సమయంలో టీడీపీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు విడిపోయి, వేరు వేరుగా బరిలో దిగాయి. ప్రతి పక్ష వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో గెలిచింది. 151 స్థానాల్లో విజయం సాధించింది. ఆ సారి వైఎస్సార్ సీపీకి అంత మెజార్టీ రావటానికి ఒకే ఒక్క కారణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల్లో పూర్తి నమ్మకాన్ని సంపాదించుకున్నారు. దీంతో ప్రజలు ఆయనకు కళ్లు మూసుకుని ఓట్లు గుద్దారు. కానీ, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే..
వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన 151 మందిలో చాలా మంది కేవలం చిల్లర ఓట్ల తేడాతో గెలిచారు. అది కూడా 1000 నుంచి 3 వేల లోపే ఉండటం గమనార్హం. జనసేన, టీడీపీ విడిపోయి పోటీ చేయటం వల్ల వైఎస్సార్ సీపీకి ప్లస్ అయింది. 2014లో జనసేన నుంచి టీడీపీకి వెళ్లిన ఓట్టు కాస్తా 2019లో జనసేనకు పడ్డాయి. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రతిపక్ష పార్టీకి వెళ్లిపోయాయి. దీంతో టీడీపీ చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైంది. జనసేన, టీడీపీ వేరుగా పోటీ చేస్తే లాభం కచ్చితంగా వైఎస్సార్ సీపీకే అని స్పష్టం అవుతోంది.
అవును, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే అధికార వైఎస్సార్ సీపీకి కచ్చితంగా నష్టమే. ఎందుకంటే.. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో ఏదో ఒక మూల అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి ప్రతిపక్ష పార్టీకి ప్లస్ అవుతుంది. అంతేకాదు! గతంతో పోల్చుకుంటే జనసేన పార్టీ కొద్దిగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీతో కలిస్తే ఓ బలమైన పొత్తుగా మారుతుంది. గ్రామ స్థాయిలో టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు.. జనసేన యువబలం, కాపు ఓట్లు అన్ని కలిసి జనసేన, టీడీపీలను గెలిపిస్తాయనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. దానికి తోడు గతంలో ఉన్నంత క్రేజ్ ప్రస్తుతం వైఎస్ జగన్‌కు లేదు. ప్రజల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా అసంతృప్తి ఉంది. దీంతో వైఎస్సార్ సీపీ మళ్లీ ప్రతి పక్షంలోకి వెళ్లిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
రాజకీయాల్లో ఓ పార్టీ లేదా.. ఆ పార్టీ అధినాయకుడు తీసుకునే కొన్ని నిర్ణయాలు పక్క పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు వైఎస్సార్ సీపీ విషయంలోనూ అదే జరగబోతోంది. పొత్తుల విషయంలో పవన్ తన కార్యకర్తలకు, అభిమానులకు క్లారిటీ ఇవ్వటం లేదు. రెండు పార్టీలు ఎన్నికలకు ఓ సంవత్సరం ముందు పొత్తులపై క్లారిటీ ఇస్తే కార్యకర్తలు చురుగ్గా పని చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎన్నికలకు ముందు చెబితే మాత్రం వారికది కష్టసాధ్యంగా మారుతుంది. పక్క పార్టీతో కలిసి పని చేయటానికి వారు ఇష్టపడకపోవచ్చు కూడా. సామాన్య జనంలోనూ పొత్తులపై నమ్మకం లేకుండా పోతుంది. ఇదే జగన్‌కు వరంగా మారనుంది.