గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సారి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండబోవని స్పష్టం చేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కు ఎదురు లేదు. ఇక జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా మారాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కేసీఆర్ గత రెండేళ్లుగా తన ప్రయత్నాలను పట్టాలెక్కించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌లతో తన ఆలోచనలను పంచుకున్న కేసీఆర్.. మరి కొన్ని రోజుల్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే 2022లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకునే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2014లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్.. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం తర్వాత తెలంగాణ సాధించిన విజయాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాతో పాటు వివిధ వేదికలు, సదస్సులను ఉపయోగించుకోనున్నారు. టీఎంసీ, ఆప్, ఎంఐఎం తరహాలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్
కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరివర్తన, గుణాత్మకమైన, ప్రబలమైన మార్పు కోసం తన బాధ్యత నిర్వర్తిస్తానని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన చేస్తానని తెలిపాడు. ఇందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీ పవర్ తగ్గుతుందన్నారు. జాతీయ రాజకీయాల్లో ఓ కార్యకర్తగా తన పాత్ర పోషిస్తానని.. ప్రధాని పదవి కోసం తాను పాకులాడటం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఎలా ఉండనుందో చూడాలి మరి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు