త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదా రాబోతుందా.. కేంద్ర సర్కార్ దీనిపై సానుకూలంగా ఉందా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తుంది. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశపు అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరినట్లు అయింది. దీనికంటే ముందే పార్లమెంటులో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు చూస్తే.. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం సానుకూలంగా ఉందనే అనిపిస్తోంది. తాజాగా మోదీ పార్లమెంటులో విభజన అంశంపై స్పందిస్తూ.. ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనాలోచితంగా విభజన చేసిందని.. దాని ఫలితంగా ఏపీ నష్టపోయిందని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు.
మరోవైపు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలో ఎన్నడు లేనిది వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశంపై బలంగా మాట్లాడారు. రాష్ట్ర వాదనను వినిపించారు. కేంద్రం తప్పనిసరిగా హోదా ప్రకటించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఈ రెండు సంఘటనల తర్వాత నేడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశపు అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడంతో ఏపీకి ప్రత్యేక హోదా పక్కా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్న మోదీ సర్కార్.. ఇన్నాళ్లు హోదా అంశంపై స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా దాటవేసింది. కానీ ఇప్పుడింత సడెన్ గా హోదా అంశంలో మనసు మార్చుకుని ఈ ప్రకటన చేయడం వెనక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవేంటంటే..
కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ మధ్య బంధం ఎలా ఉన్నా.. కేంద్రంలో మాత్రం వైసీపీ బీజేపీకి మద్దతుగానే ఉంది. కేంద్రం తీసుకువచ్చే బిల్లులకు మెజారిటీ శాతం మద్దతిస్తోంది. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పోల్చుకుంటే.. మోదీ సర్కార్ తో జగన్ మంచిగానే ఉంటున్నారు. దూకుడుగా వెళ్లడం లేదు. ఏ అంశంపై స్పందించాల్సి వచ్చినా.. ప్రత్యేక హోదా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో పాగా వేసేందుకు..
బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా పట్టు లేదు. ఒక్క కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. బీజేపీ ప్రధాన లక్ష్యం అయితే అధికారం.. లేదంటే రెండో స్థానం. ఇందుకోసం బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఫలితంగా ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాస్త దూకుడు పెంచింది. ఏపీలో బీజేపీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో మాదిరి ఇక్కడ దూకుడుగా వెళ్లే నేతలు ఏపీ బీజేపీలో లేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటుందని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీన్ని దూరం చేసి.. రాష్ట్రంలో పాగా వేయాలంటే.. ప్రత్యేక హోదాపై సానుకూల నిర్ణయం తీసుకుంటే.. బీజేపీకి మైలేజ్ లభించే చాన్స్ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ హోదా అంశంపై యూటర్న్ తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబును నమ్మలేదు..
ఏపీలో చంద్రబాబును నమ్మే పరిస్థితిలో బీజేపీ లేదు. బాబు అవసరానికి తగ్గట్లు మాట మారుస్తాడు. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు మోదీపై చేసిన వ్యాఖ్యలు, అమిత్ షాతో వ్యవహరించిన తీరును బీజేపీ ఎన్నటికి మర్చిపోదు.. చంద్రబాబును దగ్గరకు రానివ్వదు. భవిష్యత్తులో కూడా టీడీపీతో పొత్తు ఆలోచన బీజేపీకి లేదు.
ప్రస్తుతం జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉంది. ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా.. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే దీనివల్ల బీజేపీకి పెద్దగా లాభం చేకూరడం లేదు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో వచ్చిన వివిధ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుగా జనంలోకి వెళ్లినా ఆశించిన ఫలితం లభించలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ లభించాలంటే.. పార్టీపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పాడాలి. అందుకే ఇలా పొత్తుపై యూటర్న్ తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనే పార్లమెంట్ సాక్షిగా.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని.. కేంద్రం ప్రకటించింది. నూతన రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్నాడు. ఆ సమయంలో విపక్షంలో ఉన్న జగన్ తమకు అవకాశం ఇస్తే.. ప్రత్యేక హోదా సాధించి తీరతామన్నారు. చెప్పిన ప్రకారం అవకాశం వచ్చిన ప్రతి సారి సీఎం జగన్ కేంద్రం వద్ద హోదా అంశం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర నిర్ణయంతో త్వరలోనే ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర నుంచి శుభవార్త వినిపించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ప్రత్యేక హోదా అంశంలో ఎలాంటి ప్రకటన వెలువడుతుందో చూడాలి. ఇక కేంద్ర నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.