ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. దాంతో సర్వే సంస్థలన్ని రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలను ఆగస్టు 11 గురువారం విడుదల చేసింది. ఈ సర్వేలో ఏపీకి సంబంధించి రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. అధికార వైసీపీ పార్టీ.. మొత్తం 18 సీట్లలో గెలుస్తుందని సర్వే వెల్లడించింది. అలానే ప్రతిపక్ష టీడీపీ మిగిలిన ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక జనసేన, బీజేపీకి ఈ సారి కూడా నిరాశ తప్పదని వెల్లడించింది. తాజా సర్వేలో బీజేపీ, జనసేనకు ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తేలిపోయింది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తూర్పు గోదావరి, కోనసీమ ప్రాంతంలో ఎంపీ సీటు గెలుస్తామని ఆశిస్తున్న నేపథ్యంలో సర్వే ఫలితాలు వారికి షాకిచ్చాయి. ఇప్పటికి రాష్ట్రంలో అత్యధిక మంది ఓటర్లు వైసీపీ తరఫునే ఉన్నారని సర్వే స్పష్టం చేసింది. అధికార పార్టీపై వ్యతిరేకత పెద్దగా లేదని తాజా సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. ప్రజలు మరోసారి జగన్‌కే జై కొట్టడానికి కారణాలు ఏంటి.. ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశాలు ఏవంటే..
నవరత్నాలు అమలు..
2019 ఎన్నికల ముందు సీఎం జగన్ నవరత్నాలు పేరుతో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా రాజకీయ నేతల మాదిరి కాకుండా ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చారు. జగన్ తీసుకువచ్చిన పథకాలతో సమాజంలోని నిమ్న, ఉన్నత సామాజిక వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందుతున్నారు. వార్షిక ఆదాయం రూ. 5,00,000 దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వర్తింపు. పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చుతో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా ప్రతి విద్యార్ధికి రూ. 20 వేలు సాయం. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు అందించడం.
వైయస్‌ఆర్ ఆసరా ద్వారా సున్నా వడ్డీకే రుణాలు, వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మహిళకు దశలవారీగా రూ. 75 వేలు ఆర్థిక సాయం. పించన్ల పెంపు కింద ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గించడం.. పింఛన్ మొత్తాన్ని రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోవడం. అమ్మఒడి ద్వారా పిల్లలని బడికి పంపితే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.14,000, వైయస్‌ఆర్ రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఆర్థిక సాయం, వైఎస్సార్ జలయజ్ఞం వంటి పథకాలను తీసుకువచ్చారు.
ఇవే కాక ఉన్నత సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనకబడిన మహిళలను ఆదుకోవడం కోసం కాపు నేస్తం పేరుతో మొత్తం 5 ఏళ్ల కాలంలో 75 వేల రూపాయలను ఇవ్వనున్నారు. అలానే ఆటో, ట్యాక్సి, మ్యాక్సి డ్రైవర్లను ఆదుకోవడం కోసం వాహనమిత్ర పథకం ద్వారా ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇలా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూనే మెరుగైన సమాజంలో కీలక పాత్ర పోషించే విద్యా వ్యవస్థపై కూడా దృష్టి కేంద్రీకరించారు సీఎం జగన్. దానిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేసేందుకు నాడు-నేడు కింద వాటిని అభివృద్ధి చేస్తున్నారు.
ఇక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. మహిళల భద్రత కోసం దిశ యాప్, చట్టం, పోలీస్ స్టేషన్లను తీసుకువచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం కోసం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.. ప్రజల ఇంటి వద్దకే పాలనకు మార్గం చూపారు. ఇవే కాక.. ప్రజా సంక్షేమం కోసం మరిన్ని కొత్త పథకాలు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు సీఎం జగన్.
అభివృద్ధి పథంలో నడిపిస్తూ..
ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తూనే.. తమకున్న వనరులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాల అమలులో ఏపీ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటూ.. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సీఎం జగన్ తీసుకువచ్చిన పథకాలు.. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలే.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని, విశ్వసాన్ని పెంచాయి.. దాని ఫలితమే ఈ సర్వే ఫలితాలు అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. అంతేకాక రానున్న ఎన్నికల్లో జగన్ టార్గెట్ ప్రకారం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సర్వే ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.