గత కొంత కాలంగా తెలంగాణలో హూజూరాబాద్ పేరు మారుమోగుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో.. వైసీపీ ఎమ్మెల్యే హఠాత్తుగా మరణించడంతో బద్వేల్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే తెలంగాణ లో ప్రధాన పార్టీలు ఇక్కడ తమ జెండా ఎగురవేయాలని నానా తంటాలు పడుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో దేశంలో మరో ఉప ఎన్నికల సంగ్రామానికి సన్నాహాలు మొదలు పెడుతున్నారు. ఈసారి ఎన్నికలో గెలుపొంది తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై తిరుగులేని ఆధిపత్యం సాధించాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణతో పాటు ఏపీలోని బద్వేల్ ఉపఎన్నికపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పట్లో ఈ రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు ఉండవని ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికను వాయిదా వేసినట్లు సీఈసీ పేర్కొంది. వరదలు, పండుగలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉప-ఎన్నికలు ఇప్పుడే నిర్వహించవద్దని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాలు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించాయి. ఈ నేపథ్యంలో పండుగల సీజన్ పూర్తి అయిన తర్వాత ఉప-ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి మేర ఆమె పోటీ చేస్తున్న బెంగాల్ లోని భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాల్లో, ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. సీఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నాలుగు నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6 విడుదల కానుండగా.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13గా ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తానికి పండుగల అనంతరం హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలు జరగనున్నాయి.