41వ రోజు పాదయాత్ర సందర్భంగా అంగళ్లు వద్ద యువత, మహిళలు, వృద్దులు తమ సమస్యలను లోకేష్‌కు చెప్పుకున్నారు. నందిరెడ్డివారిపల్లి విశ్వం కాలేజీ వద్ద కురుబ సామాజికవర్గీయులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. శనివారం 41వ రోజు పాదయాత్ర తంబళ్లపల్లె నియోజకవర్గంలోని నందిరెడ్డివారిపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం అయింది. యాత్ర ప్రారంభానికి ముందు ఆయన ‘సెల్ఫీ విత్ లోకేష్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 1000 మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. అంగళ్లులో టీడీపీ కార్యకర్తలు, నాయకులు నారా లోకేష్‌కి ఘన స్వాగతం పలికారు. లోకేష్‌ని చూసేందుకు భారీగా ప్రజలు రోడ్ల పైకి తరలివచ్చారు. యువత, మహిళలు, వృద్దులు తమ సమస్యలను లోకేష్‌కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ జగన్ పాలనలో అందరూ బాధితులే. జగన్ పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న అసాధారణ పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. జగన్ అడ్డగోలుగా పెంచిన అన్ని పన్నులు తగ్గిస్తాం. పేద వాడిపై పన్నుల భారం తగ్గిస్తాం. రాష్ట్రంలో 6 లక్షల పెన్షన్లు కట్ చేసింది జగన్ ప్రభుత్వం. ఆఖరికి చెత్త పన్ను కూడా పెన్షన్‌లో కట్ చేసే దారుణమైన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ పెన్షన్లు ఇచ్చి తీరుతాం’’ అని అన్నారు. అనంతరం నందిరెడ్డివారిపల్లి విశ్వం కాలేజీ వద్ద కురుబ సామాజికవర్గీయులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వాటిపై లోకేష్ స్పందిస్తూ..
‘‘ కురుబల కోసం తొలుత కురుబ కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి సంక్షేమానికి కృషి చేసింది టీడీపీ మాత్రమే. కురుబ సామాజికవర్గానికి చెందిన ఎస్ రామచంద్రారెడ్డి, బీకే పార్థసారధి, బత్తిన వెంకటరాముడుకి ఎమ్మెల్యేగా, ఎంపీ, జెడ్‌పీ చైర్మన్ గా అవకాశం కల్పించాం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గొర్రెల మేపు కోవడానికి బీడు భూములు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తాం. కురుబల ఆరాధ్య దైవం కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం. కురుబ భవనాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తాం’’ అని అన్నారు. సాయంత్రం 4 గంటలకు టీకెఎన్ వెంచర్ అన్నమయ్య నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.