ఆత్మకూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే, అజాత శత్రువుగా పేరు పొందిన గౌతమ్ రెడ్డి గౌరవార్థం ఉప ఎన్నికలో భాగంగా ఆయన కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగాఎన్నుకుంటారని విశ్లేషణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. కానీ మిగతా పార్టీలు కూడా బరిలో నిలుస్తాయనే ఊహతో.. ముందస్తు జాగ్రత్తగా విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇక ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ గురించి టీడీపీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. బీజేపీ మాత్రం పోటీకి సై అంది. దీంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక ఏకగ్రీవం కాదని.. పోటీ అనివార్యమైనట్లే అనే సూచనలు కనిపిస్తున్నాయి.
గతంలో బద్వేలు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో కూడా టీడీపీ పోటీకి దూరంగా ఉండగా, బీజేపీ బరిలో నిలిచి గణనీయంగా ఓట్లు సాధించింది. ఇప్పుడు కూడా ఇదే వ్యూహంతో ఆత్మకూరు బరిలో దిగాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆత్మకూరులో బీజేపీ పోటీపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అధికారికంగా ప్రకటించారు. అయితే, అభ్యర్థి ఎవరనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ మేరకు నెల్లూరులో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. జనసేనతో తప్ప మరే పార్టీతోనూ పొత్తుపెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: మేకపాటి రాజమోహన్‌రెడ్డి మేనల్లుడి సంచలన ప్రకటన.. తప్పకుండా పోటీ చేస్తా!
తెలుగు దేశం పార్టీతో బీజేపీ పొత్తు ఉంటుందని చంద్రబాబునాయుడు డ్రామాలాడుతున్నారని ఎంపీ జీవీఎల్ విమర్శించారు. ఇప్పటికే బీజేపీ అధినాయకులతో మాట్లాడామని చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మరి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: గౌతమ్ రెడ్డి కుమార్తె చేసిన పనికి అంతా కన్నీరు