ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది ముఖ్య నేతలు పార్టీకి దూరం అయ్యారు. మరి కొందరు యాక్టీవ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. రెండో క్లాస్ నేతలే దర్శనం ఇస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తామే హీరోలమంటూ చెలామణి అయిన ముఖ్యనేతలేవరు ఇప్పుడు కనిపించడం లేదు. పార్టీ ఓడిపోగానే ముఖం చాటేయడంతో.. నేతల కొరతతో టీడీపీ సతమతమవుతోంది.
ప్రస్తుతం గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడింది. నామ్ కే వాస్తుగా ఉన్న సెకండ్ క్లాస్ నాయకులతో జిల్లాలో టీడీపీ కాలం నెట్టుకొస్తుందట. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీ యాక్టీవ్ గా లేకపోవడం.. ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందడంతో.. ప్రసుత్తం జిల్లాలో తమ్ముళ్లకు రిప్లై ఇచ్చే నేతలు కూడా కరువయ్యారని సమాచారం. పరిస్థితి ఇలానే కొనసాగితే.. రానున్న ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా గల్లంతయ్యే పరిస్థితి తలెత్తుతుందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : గంటా శ్రీనివాసరావు కోసం దిగొచ్చిన చంద్రబాబు!
ఆ రెండు ముఖ్యమైనవి..
గుంటూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉండే నియోజకవర్గాల్లో పశ్చిమ, తూర్పు సెగ్మెంట్ లు ముఖ్యమైనవి. అయితే ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పోరాడేందుకు బలమైన నేతలు కరువయ్యారని తెలుస్తోంది. తూర్పులో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు పట్టుమని పది మంది నేతులు కూడా రావడం లేదు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ఒకటే ముఖాలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేనంత బిజీ నేతలకు పదవులు కట్టబెట్టి.. పార్టీని నిర్విర్యం చేస్తున్నారని తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఫలితంగా ఈ రెండు ప్రాంతాల్లో పార్టీకి ఎప్పటినుంచో ఉన్న బలమైన కేడర్ దూరమయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వార్డు కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన నేతలు సైతం ప్రస్తుతం పార్టీలో కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఎంపీ గల్లా జయదేవ్ అనే అంటున్నారు తమ్ముళ్లు.
అందుకే గల్లాపై ఆగ్రహం..
2019 లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ గెలిచారు. టీడీపీ విజయం సాధించిన సంతోషం కార్యకర్తల్లో ఎక్కువరోజులు నిలవలేదు. వృత్తిపరంగా వ్యాపారవేత్త అయిన జయదేవ్ తన వ్యక్తిగత కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు తప్పితే.. నియోజకవర్గంలో పెద్దగా కనిపించరని.. పార్టీ వ్యవహారాల్లో పాల్గొనరని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీకి ఉన్న బలమే తక్కువ. అలాంటి వేళ ఎంపీ స్థాయి నాయకుడు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి. కానీ జయదేవ్ పార్టీ వ్యవహారాల్లో పెద్దగా కనిపించకపోవడంతో.. మిగతా నేతలు కూడా అదే మాదిరి వ్యవహిస్తున్నారని సమాచారం. ఈ పరిణామాలు నచ్చని టీడీపీ మాజీ ఎంపీ లాల్ జాన్ పాషా కుటుంబం పార్టీకి దూరం జరిగింది. ఫలితంగా తూర్పు డివిజన్ నియోజకవర్గంలో పార్టీకి ఓటమి తప్పలేదు.
ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఇప్పటికే జయదేవ్ వ్యవహరంపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని.. ఈ విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది. ఇక జయదేవ్ ఇప్పటికైనా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటే.. కేడర్ లో ఉత్సాహం వస్తుంది.. తిరిగి గుంటూరులో టీడీపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందంటున్నారు కార్యకర్తలు. ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి అంటున్నారు తమ్ముళ్లు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.