గణతంత్ర దినోత్సవం నాడు దేశ వ్యాప్తంగా ప్రజలు జెండా పండుగ జరుపుకుంటుండగా.. గుంటూరులో మాత్రం.. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు పహరా.. జనాల ఆందోళన మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగురవేస్తామని హిందూ వాహిని చేసిన ప్రకటనతో ఈ ఉద్రిక్తత మొదలైంది. అన్నట్టుగానే జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారు హిందూ వాహినీ కార్యకర్తలు. కాగా వీరి ప్రయత్నాన్నిపోలీసులు అడ్డుకున్నారు. టవర్‌వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించినవారిని.. అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. దీంతో, టవర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా టవర్ వైపు ఎవర్నీ రానీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. టవర్ చుట్టూ ఇప్పటికే భారీ కంచెను నిర్మించింది కార్పొరేషన్. దాని చుట్టూ మరిన్ని బారీకేడ్‌లు ఏర్పాటు చేశారు పోలీసులు.
వివాదం ప్రారంభమైందిలా..
కాగా ఈ టవర్‌కు పేరు మార్చాలన్న బీజేపీ నేతల డిమాండ్‌తో ఈ వివాదం మొదలైంది. 75ఏళ్ల తర్వాత కూడా ఓ దేశద్రోహి పేరుతో సెంటర్ ఉండటం దేశానికే అవమానమంటున్నారు బీజేపీ నేతలు. దాని పేరు మార్చాలనీ.. లేకపోతే కూల్చేస్తామని ఇటీవల బీజేపీ నేతలు హెచ్చరించడం వివాదానికి బీజం వేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. జిన్నా టవర్‌పై పెట్టిన ట్వీట్.. ఈ రచ్చకు కారణమైంది.
ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నాయకుడు, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జిన్నా సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేసిన రాజాసింగ్.. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యకర్తలు జిన్నా టవర్‌ను కూలగొట్టండి అంటూ కామెంట్ చేశారు. వెంటనే ఆ పేరును తొలిగించి స్వాతంత్య్ర యోధుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. జిన్నా టవర్ పేరు మార్చి.. అబ్దుల్ కలామ్ టవర్ అని పెట్టాలంటూ డిమాండ్ చేశారు. అదే విధంగా బ్రిటీష్ రాజుల పేర్లు కూడా మార్చాలని కోరారు.