కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్థన్‌రెడ్డి పెట్టిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ బీజేపీ కొంపముంచింది. గాలి పార్టీ కారణంగా బీజేపీ మంత్రులు, కీలక నేతలు సైతం ఇప్పుడు ఓటమికి దగ్గరా ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతం వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 66 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బీజేపీ దారుణంగా ఫెయిల్ అయింది. పట్టు ఉన్న జిల్లాల్లో కూడా విజయానికి దూరంగానే మిగిలిపోయింది. కీలక నేతలు కూడా బొటాబోటీగా గెలుపునకు చేరువవుతున్నారు. గాలి జనార్థన్‌రెడ్డి పెట్టిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ కారణంగా బీజేపీ కంచుకోటగా ఉన్న బళ్లారిలో దారుణ పరిస్థితి నెలకొంది.
బళ్లారి సిటీ నియోజకవర్గంలో బీజేపీ మంత్రులు సైతం వెనుకంజలో ఉన్నారు. బళ్లారి సిటీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖర్ రెడ్డి మూడో స్థానంలో.. గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ రెండో స్థానంలో.. కాంగ్రెస్ అభ్యర్థి భరత్ మొదటి స్థానంలో ఉన్నారు. బీజేపీ ఓటు బ్యాంకును గాలి జనార్థన్‌రెడ్డి పార్టీ చీల్చటంతో కాంగ్రెస్‌కు మేలయింది. చిక్బల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి సుధాకర్, బళ్లారి రూరల్లో మంత్రి శ్రీరాములు, చిక్‌మంగళూరులో మంత్రి సిటీ రవి.. మంత్రి సొమ్మన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. ఏది ఏమైనా గాలి జనార్థన్‌రెడ్డి పార్టీ బీజేపీ కొంపముంచింది. కాగా, గత ఎన్నికల్లో బీజేపీ 103 స్థానాల్లో విజయం సాధించింది. కానీ, ఈ సారి 70 స్థానాల్లో కూడా విజయం సాధించే అవకాశం కనిపించటం లేదు.
ప్రధాని వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ ఘోర ఓటమికి కారణం అయ్యాయని తెలుస్తోంది. ఇక, జేడీఎస్ కూడా 21 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఆ పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు బీజేపీ, జేడీఎస్ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. మరి, బీజేపీ కొంపముంచిన గాలి పార్టీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.