ప్రస్తుతం నెల్లూరు రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి, చర్చకు దారితీస్తోంది. తాజాగా నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను పార్టీ మారబోతున్నట్లు, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇష్టప్రకారమే పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్దఎత్తున చర్చకు తావిస్తున్నాయి. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే వైఎస్సార్ కుటుంబానికి ఎంత విధేయుడో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి ఇలా పార్టీ మారుతున్నాను అని చెప్పడం, పైగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఆరోపించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ సందర్భంలో అసలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరు? అతని రాజకీయ ప్రస్థానం ఏంటనే వెతుకులాట మొదలైంది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. విద్యార్థి సంఘం నేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మూడోసారి గెలుపు కోసం వ్యూహాలు, ప్రయత్నాలు కూడా ప్రారంభించేశారు. ఆయన 1980ల్లో వీఆర్ కళాశాల విద్యార్థి సంఘం నేతగా, తర్వాత ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ మెంబర్ గా కూడా పని చేశారు. అంతేకాకుండా ఆయన ఏబీవీపీలో కూడా పనిచేశారు. కానీ, తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విధానాలు, ఆశయాలకు ఆకర్షితుడు అయ్యి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నుంచి ఆయన రాజశేఖర్ రెడ్డి విధేయుడిగా కొనసాగారు.
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన విధేయతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సమయంలో ఎంతోమంది నాయకులు, బడా నేతలు జగన్ ను వదిలిపెట్టేందుకు సిద్ధపడిపోయారు. కానీ, అలాంటి సమయంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ వెన్నంటే ఉన్నారు. 2009 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. జగన్ జైలుపాలైన సమయంలోనూ పార్టీకి తోడుగా ఉన్నారు. జగన్ సోదరి షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్న సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారు.
2014లో కోటంరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఘన విజయం నమోదు చేశారు. సమీప అభ్యర్థిపై ఏకంగా 25 వేలకు పైగా మెజారిటీ గెలుపొందారు. 2019లో కూడా అదే తరహా విజయాన్ని నమోదు చేశారు. ఇంత విధేయుడిగా, పార్టీకి నమ్మకంగా ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి నేత ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవ్వడమే ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు, రాజకీయ విమర్శలకు తావిస్తోంది. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలను గమనిస్తే.. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ.. రెండోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సమయంలో పార్టీ నుంచి కొంత గుర్తింపు ఆశించినట్లు చెప్పారు.
అలాంటి గుర్తింపు, ప్రాధాన్యత దక్కకపోగా తనకి అవమానాలు జరిగాయంటూ కోటంరెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ విమర్శించారు. నాయకుడే తనని నమ్మకపోతే ఇంక పార్టీలో కొనసాగడం ఎందుకు అని ప్రశ్నించారు. ఇంక ఒక్క క్షణం కూడా పార్టీలో ఉండాల్సిన అవసరం తనకు లేదంటూ వ్యాఖ్యానించారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని చెబుతూనే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇష్టప్రకారం పోటీ చేస్తానంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.