హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ చాలా సీరియస్‌గా తీసుకుంది. బీజేపీ మాత్రం భారమంతా ఈటెలపైనే వదిలేసింది. కాగా ఈ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే అన్ని పార్టీలు ఒకరిని ఒకరు కలుపుకుని పోతుంటే బీజేపీలో మాత్రం వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఈటల వర్గాన్ని విస్మయానికి గురిచేసింది. హుజురాబాద్ టౌన్ అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డి(లడ్డు)ను తొలగిస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విడుదల చేసిన లేఖ కలకలం సృష్టిస్తోంది.
ఓ వైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉండాల్సిన నాయకులు పార్టీ అంతర్గత వ్యవహారాలను రచ్చకెక్కించుకోవడం పార్టీకి మైనస్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపే లక్ష్యంగా పని చేయాల్సిన నాయకులు వర్గపోరుకే ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. విద్యార్థి దశ నుంచి బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్న మహేందర్‌ను దురుద్దేశంతోనే ఎన్నికల వేళ తప్పించారని స్థానిక బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.