‘నాకు ఎదురైన అవమానాలు, నేను పడ్డ బాధలన్ని నీకు తెలుసు, నువ్వూ అనుభవించావు.. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నావ్, కావాలంటే నీ ఇల్లాలిని అడుగు, తడిచిపోయిన మెత్తను అడుగు’ అని టీఆర్‌ఎస్ నేత, మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. బుధవారం హుజూరాబాద్ మధువని గార్డెన్స్‌లో, వీణవంక మండలం ఘన్ముక్కుల గ్రామంలో టీఆర్‌ఎస్, టీడీపీకీ చెందిన పలువురు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లా డుతూ, ఫ్లెక్సీల్లో, గోడలపై మీ ఫొటోలుండొచ్చు. కానీ నా ఫొటో ప్రజల గుండెల్లో ఉంది. గాలి దుమారానికి, వర్షానికి మీ ఫొటోలు కొట్టుకు పోతాయి. కానీ ప్రజల గుండెల్లో ఉన్న నా ఫొటో చెరిగిపోదు’ అన్నారు. ఒకప్పుడు ప్రజా దర్బారు లాంటి కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రులు ప్రజలను కలుసుకునేవారని తెలిపారు.
కేసీఆర్ బొమ్మ పెట్టుకుని నేను గెలవలేదు..
‘నేను గడ్డి పోచను కాదు. గడ్డపారనని కేసీఆర్‌కు అర్థమైంది. కేసీఆర్ బొమ్మ పెట్టుకుని నేను గెలవలేదు. హుజూరాబాద్ ప్రజల కాళ్లలో ముళ్లిరిగితే పంటితో పీకాను కాబట్టే ఇన్నాళ్లూ నా ప్రజలు గెలిపిస్తున్నారని ఈటల అన్నారు. చివరకు తనలాంటి వాళ్లనూ ప్రగతిభవన్ గేట్ల దగ్గరే పోలీసులు ఆపారని గుర్తుచేసు కున్నారు.