రానున్న జనరల్ ఎన్నికల్లో.. జాతీయ స్థాయిలో సత్తా చాటాలని భావిస్తోంది బీఆర్‌ఎస్ పార్టీ. దక్షిణాది రాష్ట్రాల్లో దూకుడుగా ముందుకు వెళ్తోంది బీఆర్‌ఎస్. అయితే తాజాగా ఎన్నికల సంఘం.. బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..
ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్ పార్టీ.. అనుకున్న గమ్యాన్ని చేరుకుంది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పట్టుదల, కృషి వల్ల.. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. నూతన రాష్ట్రంలో సత్తా చాటి.. అధికారంలోకి వచ్చింది టీఆర్‌ఎస్ పార్టీ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్.. దేశ రాజకీయాల్లో కీలంగా వ్యవహరించాలని ఆశిస్తున్నారు. దానిలో భాగంగా టీఆర్‌ఎస్‌ను జాతీయ స్థాయిగా మార్చి.. భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. రానున్న జనరల్ ఎలక్షన్‌లో దేశవ్యాప్తంగా సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో దూకుడుగా ముందుకు వెళ్తోంది బీఆర్‌ఎస్ పార్టీ. దీనిలో భాగంగా మహారాష్ట్రలో ఇప్పటికే భారీ ఎత్తున చేరికలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు బీఆర్‌ఎస్ జనరల్ ఎన్నికల కోసం రెడీ అవుతోండగా.. మరోవైపు ఎన్నికల సంఘం.. బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..
ఎన్నికల ముందు.. బీఆర్‌ఎస్‌కు ఈసీ భారీ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌కు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఏపీ పరిధిలో 2014, 2019లలో నిర్వహించిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. అందుకే పార్టీ గుర్తింపును తెలంగాణకే పరిమితం చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి, చెల్లుబాటైన ఓట్లలో కనీసం 6 శాతం దక్కించుకోవాల్సి ఉంటుంది. అలాగే కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుచుకున్న పార్టీలకు రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉంటుంది. లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు, ఒక ఎంపీనైనా గెలుచుకుంటేనే ఆ పార్టీకి.. రాష్ట్ర పార్టీ హోదా ఉంటుంది.
గతంలో బీఆర్‌ఎస్.. టీఆర్ఎస్‌గా ఉన్న సమయంలో విభజనకు ముందు రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉంది. విభజన జరిగినా కూడా ఎన్నికలు అంతకుముందే జరగడంతో రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా ఉంది. కానీ 2019 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయలేదు. అందుకే ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా రద్దుపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కానీ ఆ పార్టీ స్పందించలేదని ఈసీ చెబుతోంది. లేఖలు రాసినా స్పందనలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేవలం తెలంగాణలోనే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఉంటుంది.
బీఆర్ఎస్ ఏపీలో గుర్తింపు కోల్పోతే.. ఆప్‌కు మాత్రం ప్రమోషన్ వచ్చింది. రాష్ట్ర పార్గీగా ఉన్న ఆప్‌కి.. జాతీయ పార్టీ హోదా వచ్చేసింది. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవాల్లో ఆప్ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. ఇక మరో మూడు పార్టీలకు ఈసీ షాకిచ్చింది. ఎన్‌సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐలు జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈసీ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలె తెలియజేయండి.