ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సమావేశంలో ముగ్గురు వైసీపీ నేతల ఓటమే తన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ నేతలు శపథాలు చేయడం, తొడలు కొట్టడం వంటివి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంపై నిప్పులు చెరిగారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ఒక స్క్రిప్ట్ ప్రకారం సమావేశం జరిగిందని ఆరోపించారు. సమావేశంలో స్టేజ్ మీద తొడలు కొట్టి , శపథాలు చేసిన టీడీపీ నేతల చీకటి బతుకులు తనకు బాగా తెలుసని అవినాష్ ఎద్దేవా చేశారు. వీరంతా ఉదయం చంద్రబాబుని.. దేవుడు అని పొగుడుతారని.. కానీ రాత్రి మాత్రం వెధవ అంటూ పచ్చి బూతులు తిడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు అవినాష్. ప్రసుత్తం ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
వైఎస్సార్‌సీపీ నాయకుల కన్నా టీడీపీ నేతలే చంద్రబాబుని ఎక్కువగా తిడతారని దేవినేని అవినాష్ చెప్పుకొచ్చాడు. గద్దె రామ్మోహన్‌రావు తన ఎదుటే చంద్రబాబును విమర్శించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచింది కాబట్టి ఏం చేయలేక టీడీపీ నేతలు కవ్వింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని దేవినేని అవినాష్ హెచ్చరించారు. విజయవాడలో టీడీపీ భూస్ధాపితం అయిపోయిందని.. దేవినేని ఉమాకు మైలవరంలోనే గతిలేదు.. ఇంకా జిల్లాలో టీడీపీని ఏం గెలిపిస్తారని అవినాష్ ఎద్దేవా చేశారు.
కొన్నాళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌లో టీడీపీ నేతలు పాత్రదారులు అని దేవినేని అవినాష్ ఆరోపించారు. దేవినేని ఉమాకి మైలవరంలోనే దిక్కులేదని.. ఇక గద్దె రామ్మోహన్‌ని ఎటు పొమ్మంటారో ఆయనకే తెలియదు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరటం ఖాయమని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.