ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ రాజకీయాల్లో హీట్ రాజేసింది. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో.. ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీనితో పాటు మరో ఆసక్తికర చర్చ కూడా తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
ఢిల్లీ లిక్కర్ స్కాం.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్‌కి సంబంధించి.. ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక కవితకు ఈడీ నోటీసులు నేపథ్యంలో.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కవితకు నోటీసులపై బీఆర్‌ఎస్ వర్గాలు బీజేపీపై మండి పడుతుండగా.. బీజేపీ నేతలు మాత్రం.. కవిత తప్పు చేసింది కనుకే ఈడీ నోటీసులు జారీ చేసింది అని ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై ఆరోపణలు, విమర్శలు పక్కకు పెడితే.. కవితకు నోటీసులు నేపథ్యంలో.. తెలంగాణలో వాట్ నెక్స్ట్ అనే దాని గురించి తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది.
ఇక కవితను ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. నేడు, రేపు వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు. నేడు అనగా గురువారం ప్రగతి భవన్‌లో కేబినేట్ భేటీ ఉండగా.. రేపు అనగా శుక్రవారం కేసీఆర్ అధ్వర్యంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అయితే కవితను ఈడీ విచారించే నేపథ్యంలో.. ఈ వరుస సమావేశాల్లో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. శుక్రవారం నిర్వహించబోయే బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం గురించి ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలకు సమాచారం చేరింది. ఇక శుక్రవారం నాడు నిర్వహించబోయే సమావేశానికి సంబంధించి ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా.. రాష్ట్ర అసెంబ్లీ రద్దు గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. అదేంటి.. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్నాయి కదా.. ఈ లోపే అసెంబ్లీ రద్దు చేయడం ఎందుకు.. అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తారా అంటే.. కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో.. ఒవకేళ.. ఆమెను అరెస్ట్ చేసినట్లయితే.. వెంటనే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్లడానకి కేసీఆర్ రెడీ అవుతోన్నట్లు సమాచారం. దీని గురించి కేసీఆర్ శుక్రవారం నాటి సమావేశంలో పార్టీ నేతలతో చర్చించనున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
త్వరలోనే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక కవిత విషయంలో ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు అనుసరించే తీరును బట్టి.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలా లేదా అన్న దాని గురించి కేసీఆర్ ఓ నిర్ణయానికి రాబోతున్నారని సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తనకు లేదని.. ఇప్పటికే కేసీఆర్ అనేకసార్లు స్పష్టం చేశారు. కానీ కవిత అరెస్ట్ అయితే మాత్రం.. కేసీఆర్ ముందుస్తుకు రెడీ అవుతారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజంగానే కవిత అరెస్ట్ అయితే.. తెలంగాణ అసెంబ్లీ రద్దయి.. ముందస్తు ఎన్నికలు వస్తాయా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.