పరువు నష్టం కేసులో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి.. సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ ఎంపీ పదవి కోల్పోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ వివరాలు..
బీజేపీ ఎమ్మెల్యే వేసిన పరువు నష్టం కేసులో.. సూరత్ కోర్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చడమే కాక.. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు తీర్పు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ జైలుకు వెళ్తారా.. అదే జరిగితే ఆయన ఎంపీ పదవి కోల్పోతారా.. లేదంటే ఎంపీ పదవి కాలం పూర్తయ్యే వరకు వేరే ఏమైనా వెసులుబాటు ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన సూరత్ కోర్టు.. ఈ తీర్పును.. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు రాహుల్‌కి విధించిన శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది సూరత్ కోర్టు.
ఈ తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవి కోల్పోతారని ప్రచారం జరుగుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం.. పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారు. నేర నిరూపణ అయితే, ఎంపీలు తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో.. లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఈ తీర్పుపై.. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు.. సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో.. లోక్‌సభ సెక్రెటేరియట్ అప్పటివరకు రాహుల్ గాంధీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చుని తెలుస్తోంది. ఈలోపు రాహుల్ గాంధీ పై కోర్టులో అప్పీలు చేసుకుంటే, శిక్షను తగ్గించే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఆయనకు ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి రాకపోవచ్చని కొందరు అంటున్నారు.
రాహుల్ గాంధీ ఎంపీ పదవి కోల్పోతారా లేదా అన్న సంగతి పక్కకు పెడితే.. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు మాత్రం రాహుల్ గాంధీ హాజరు కాకపోవచ్చని చర్చ జరుగుతోంది. మరోవైపు.. భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని.. అంతవరకు సభలో ప్రసంగించేందుకు అవకాశం కల్పించొద్దని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. రాహుల్ గాంధీ.. కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. ‘మోదీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అయితే తాను అలా అనలేదని రాహుల్ కోర్టుకు తెలిపారు. అయితే, కోర్టు ఆయణ్ని దోషిగా తేల్చి, శిక్ష విధించింది. మరి రాహుల్ గాంధీ పదవి కోల్పోతారా.. లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.