తెలంగాణలో క్రమంగా బలం పెంచుకుంటున్న బీజేపీ.. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. చేరికల పర్వానికి తెర తీసింది. పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఒకరు తెలంగాణ బీజేపీలో చేరనున్నారు. ఆ వివరాలు..
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల్లో చేరికలు, బుజ్జగింపుల పర్వం ఇప్పటి నుంచే మొదలయ్యింది. ఇక తెలంగాణలో క్రమంగా బలం పెంచుకుని.. దూకుడుగా ముందుకు వెళ్తోన్న బీజేపీ పార్టీ.. ఎన్నికల ముందు చేరికల పర్వానికి తెర తీసింది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో చేరగా.. తాజాగా ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి.. బీజేపీలో చేరనున్నారు. కాషాయ పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆయన తెలంగాణ బీజేపీలో చేరనున్నారు.
ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ బీజేపీలో ఆయన క్రీయా శీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పదవి ఇచ్చేందుకు బీజేపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కాషాయ గూటికి చేరనున్నారు. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆయన సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. కానీ 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. మళ్లీ పొలిటికల్‌గా యాక్టీవ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరాలని భావించారు. రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు. ఆ తర్వాత బీజేపీ అగ్ర నేతలతో సమావేశం నిర్వహించి.. కాషాయ కండువా కప్పుకోనున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఎన్నికల కసరత్తులో భాగంగా కిరణ్ కుమార్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించింది బీజేపీ. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. మరి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీలో చేరడానికి కారణాలు ఏంటి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.