చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొంచెం అయోమయ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. ఇక అనంతరం కొన్నేళ్ల తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు మధ్య ఇమడలేకపోయారు. దీంతో ఆ పార్టీలో ఉండలేక అనూహ్యంగా కారు దిగి చేయి కలిపి కాంగ్రెస్‌లో చేరాడు. కొంత కాలం కాంగ్రెస్‌లో బలమైన నేతగా కొనసాగాడు. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిపోయారు.
ఎవరికి వారు ఎమునా తీరు అన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దీంతో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీలో సరైన నాయకుడు లేడని, పార్టీని ముందుకు నడిపించటంలో ఎవరూ ముందుకు రావటం లేదని బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొండా బీజేపీ పార్టీలోకి వెళ్తారని కొన్నాళ్లుగా వార్తలు కూడా వచ్చాయి. అది కాకుండా తనే స్వయంగా ఓ రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు వార్తలు సైతం లేకపోలేదు.
ఇక ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ భూ కబ్జాల ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటెలకు మద్దతు పలికారు. టీఆర్ఎస్ పార్టీ కావాలనే లేనిపోని ఆరోపణలతో ఈటెలను ఇరికించాలని చూస్తోందని బహిరంగంగానే పెదవి విప్పారు. ఈటెలతో కలిసి పోవాలని ఆయన అనుకున్నప్పటికీ ఆయన బీజేపీలో చేరిపోయారు. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయోమయంలోకి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నూతన టీపీసీసీగా ఎన్నికయ్యారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. దీంతో రేవంత్ కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ కలిశారు.
ఈ క్రమంలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా కలిసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించారు. వీరిద్దరి భేటీ అనంతరం కొండా కాంగ్రెస్ పార్టీలోకి చేరతానని చెప్పకపోయినా భవిష్యత్‌లో తన నిర్ణయాన్ని తెలియజేస్తానని తెలిపారు. ఇక ఈ తరుణంలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నట్లు తన అభిమాన వర్గం గోడు వెళ్లబోసుకుంటోంది. మరి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తారా..? లేక బీజేపీలోకి చేరుతారా అన్న ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.