తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు అందరూ జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచిస్తూనే కొందరికి మాత్రం పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అందరి చిట్టా తన వద్దనుంది అన్న సీఎం.. వాళ్ల తోకలు కత్తిరిస్తాను అంటూ హెచ్చరించారు.
గురువారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పర్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పార్టీ సర్వ సభ్య సమావేశం కూడా నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం దాదాపు 7 గంటలపాటు సాగింది. ఇందులో సీఎం కేసీఆర్ సర్వేల గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. హెచ్చరికలు కూడా చేశారు. ఎవరి పనితీరు ఏంటనే వివరాలు తన వద్ద ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోకపోతే తోకలు కత్తిరిస్తాం అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ కాస్త గట్టిగానే క్లాస్ పీకారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలవడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. ఎవరు అయితే బాగా పని చేస్తారో వారికి మాత్రమే టికెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయితీ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి టికెట్లు ఇవ్వాలో తనకి బాగా తెలుసునని కేసీఆర్ తెలిపారు. పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు ఉన్నా.. వాటిని పరిష్కరించే బాధ్యత మాత్రం మంత్రులదే అంటూ స్పష్టం చేశారు. అవినీతి అంశాలను సీఎం ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలకు కేసీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పేర్లు చెప్పకుండానే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
పనితీరు బాగోని ఎమ్మెల్యేల పేర్లను మాత్రం ఇప్పుడు బయటకు చెప్పబోనన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలను బయటపెడతా అన్నారు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగత కారణాల వల్ల వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షమ పథకాల్లో అవినీతి జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు పథకాల్లో అవినీతి జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. దళిత బంధులో కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. తమ అనుచరులు అవినీతికి పాల్పడ్డా కూడా బాధ్యత మాత్రం ఎమ్మెల్యేలే వహించాలని స్పష్టం చేశారు. నేతలు ఎవరూ కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అవినీతి విషయంలో ఇదే చివరి వార్నింగ్ అన్నారు. మళ్లీ డబ్బు వసూలు చేసినట్లు తెలిస్తే.. టికెట్ ఇవ్వకపోగా పార్టీ నుంచి బయటకు పంపుతామన్నారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.