భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్లీనరీ సమావేశాన్ని హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలకు హెచ్చరికలు చేశారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్లీనరీ సమావేశాన్ని హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పెద్ద యెత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉండనున్నాయని అన్నారు. అక్టోబర్‌లోనే ఎన్నికలు రాబోతున్నాయని, కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని, నేతలు ఇళ్లల్లో కాదు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. తాడికొండ రాజయ్య, కడియం శ్రీహరికి పరోక్షంగా సీఎం కేసీఆర్ హెచ్చరికలు చేశారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా పార్టీ కోసం పని చేయాలని ఎమ్మెల్యేలకు, నేతలకు సూచించారు.
నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే ఏం వస్తుందని..? అందరూ ఎన్నికల టార్గెట్‌గా పని చేయాలని చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని గుర్తించాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు గెలుపొందేలా కృషి చేయాలని సూచించారు. ఎటువంటి సమస్యలున్నా హైకమాండ్ దృష్టికి తీసుకురావాలన్నారు సీఎం కేసీఆర్. టికెట్ల పంచాయితీ మొదలైతే ప్రజల్లోకి వేరే సందేశం వెళుతుందని, ఎవరెవరికీ టికెట్ ఇవ్వాలో తనకు తెలుసునని అన్నారు. మనస్పర్థలు ఉన్నా పక్కన పెట్టి.. పార్టీ గెలుపు కోసం కృషి చేయండని నేతలకు సూచించారు. ఎవరీ నియోజకవర్గాల్లో వాళ్లు ఉంటూ.. ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
పని తీరు మెరుగుపర్చుకోవాలని, వచ్చే నెల నుండి ప్రతి వంద మందితో నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దళిత బంధుపై కూడా సీఎం కేసీఆర్ కామెంట్లు చేశారు. కొందరు రూ. 3 లక్షలు వసూలు చేసినట్లు తనకు సమాచారం అందిందని, ఆ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని, మళ్లీ వసూలు చేసినట్లు తన దృష్టికి వస్తే టికెట్ దక్కదని, పార్టీ నుండి తీసేయడానికి కూడా వెనుకాడను అంటూ హెచ్చరించారు. కాగా, ఈ ప్లీనరీ మొత్తం.. ఎన్నికల లక్ష్యంగా జరిగినట్లు కనిపిస్తుంది. అయితే డిసెంబర్‌లో ఎన్నికలు ఉండగా.. ఆయన అక్టోబర్‌లో ఎన్నికలు వస్తాయని చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముందస్తు ఎన్నికలకు వెళతారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.