దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి రేపు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
విశాఖపట్నం నగరాన్ని మెట్రో పాలిటన్ సిటీగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం పని చేస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు టెక్నాలజీ హబ్ కి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పర్యాటక రంగాన్ని ఆసరాగా తీసుకుని మరిన్ని పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ కి ఆగస్టు 1న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కైలాసపురం వద్ద నిర్మించనున్న ఇనార్బిట్ మాల్ కి రేపు భూమి పూజ చేయనున్నారు. విశాఖలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. సుమారు రూ. 600 కోట్ల వ్యయంతో 16 ఎకరాల స్థలంలో ఈ ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టనున్నారు.
దీంతో పాటు జీవీఎంసీ చేపడుతున్న రూ. 136 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జగన్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి తదితరులు పరిశీలించారు. విశాఖలో ఇనార్బిట్ మాల్ ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులకు ప్రయోజనకరంగా ఉంటుందని రెండవ దశలో ఇదే ప్రాంతంలో ఐటీ స్పేస్ ని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. హైదరాబాద్ లో 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈరోజు విశాఖలో 17 ఎకరాల్లో దాదాపు 13 ఎకరాల్లో మాల్ ని నిర్మాణం జరుగుతుందని అన్నారు.
ఈ మాల్ ని నిర్మిస్తున్నామని చెప్పగానే 80 మల్టీనేషనల్ కంపెనీలు బుకింగ్ చేసుకున్నారని అన్నారు. 6 లక్షల చదరపు అడుగుల్లో ఏవైతే అవుట్ లెట్స్ పెడుతున్నామో వాటిలో 80 శాతం ఒప్పందం చేసుకున్నామని.. 7 మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా నిర్మిస్తున్నామని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని.. భోగాపురం ఎయిర్ పోర్ట్, మూలపేట పోర్ట్, వైజాగ్ టెక్నాలజీ పార్క్, ఒబెరాయ్ హోటల్స్ నిర్మాణంలో ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రానున్న కాలంలో విశాఖ నగరంలో మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టడం ఖాయమని ఆయన అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఇటీవల నిర్మించిన ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ ప్రాంగణాలను కూడా వైఎస్ జగన్ రేపు ప్రారంభించనున్నారు.