ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? సీఎంగా జగన్ బాధ్యత చేపట్టి రెండున్నరేళ్లవుతున్న తరుణంలో తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే వార్త హట్ టాపిక్‌గా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో ఏపీలో మొత్తం 151 స్థానాల్లో విజయభేరి మోగించి జగన్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు.
ప్రమాణ స్వీకార అనంతరం రెండున్నరేళ్ల కాలంలో కొంత మంది మంత్రులు, ఆ తర్వాత రెండున్నరేళ్ల కాలం పాటు మరి కొంతమందికి మంత్రివర్గంలో పదవులు ఇవ్వాలని జగన్ తొలి నాళ్లల్లో చెప్పుకొచ్చారు. ఈ మాట ప్రకారమే నడుచుకుంటున్న మంత్రులు ఆ రెండున్నరేళ్ల కాలం దగ్గరపడుతుండటంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ మంత్రులందరికీ ఉద్వాసన పలుకుతారా లేక శాఖల పని తీరును బట్టి నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. ఇక రెండున్నరేళ్ల పదవి కాలం అంటే ఈ నవంబర్‌తో ముగుస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రుల్లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో 90 శాతానికిపైగా మంత్రులందరికీ ఉద్వాసన పలకనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ఖాళిల్లో కొత్తవారిని నియమించి వారికి మంత్రివర్గంలో అవకాశాలు ఇవ్వాలని జగన్ భావిస్తున్న వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. మరి నిజంగానే మంత్రులందరిని శాఖల నుంచి తొలగిస్తే వారి భవిష్యత్ ఎంటన్న ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇక పాత మంత్రుల పదవి కాలం ముగియనుండటంతో జగన్ కొత్తవారిని ఎవరెవరిని నియమించనున్నారని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.