ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే నెల్లూరు నేతల పంచాయతీతో అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటుండగా.. తాజాగా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై.. గన్నవరం ఆ నియోజకవర్గపు వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావులు ఇద్దరూ ఆగ్రహంతో ఉన్నారు. వంశీ పార్టీలోకి రావటాన్ని వీరిద్దరూ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక వంశీతో పాటుగా ఆయనకు మద్దతుగా నిలుస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని గురించి.. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావులు కొన్ని రోజుల క్రితం ఓ ప్రయివేటు మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి.
యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు ఇద్దరూ కొడాలి నాని, వంశీ చదువు, ఆస్తి వ్యవహరాలపైన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల పైన స్పందించిన దుట్టా రామచంద్రరావు వచ్చే ఎన్నికల్లో గన్నవరం అభ్యర్ధి వంశీ అయితే తాము సహకరించేది లేదని స్పష్టం చేసారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం వంశీని అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ దుట్టా రామచంద్రరావు మాత్రం వంశీని ఓడిస్తామని అంటున్నారు. మరోవైపు యార్లగడ్డ కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర్య అభ్యర్థిగా లేదంటే కేడర్ కోరితే టీడీపీ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు వంశీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు పంచాయతీతో సతమతమవుతున్న వైసీపీ అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.