ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు. ‘ఇది గౌరవ సభ కాదు.. కౌరవుల సభ. మళ్లీ సీఎం అయ్యాకే తిరిగి ఈ సభలో అడుగుపెడతా’ అంటూ చంద్రబాబు శపథం చేశారు. తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో కన్నీటి పర్యంతమయ్యారు. ‘రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నిసార్లు విమర్శలు చేసినా, బూతులు తిట్టినా.. మేము ఎందుకు అలా స్పందించలేదంటే మాకు చేతకాక కాదు. అది మా ధోరణి కాదు. ఎన్ని విమర్శలు చేసినా తీసుకున్నా. చివరకు నా భార్యను కూడా మాటలు అంటున్నారు’ అంటూ భావోద్వోగానికి గురయ్యారు. లైవ్‌లో వెక్కి వెక్కి ఏడ్చేశారు. అయితే ప్రత్యర్థులు అంతా దీనిని చంద్రబాబు ఓటమిగా భావిస్తున్నారు. కానీ, రాజకీయ విమర్శకులు మాత్రం దీనిని చంద్రబాబు రాజకీయ ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. రాజకీయంగా ఎంతో పదునైన రెండు అస్త్రాలను చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించడంపై పలు ఆసక్తికర అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చంద్రబాబు ఓటమి కాదని.. ఆయన రాజకీయంగా పుంజుకోవడానికే ఈ అస్త్రాలు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక నేత ఇలా అందరి ముందు కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు అంటే.. అది సదరు ఓటరును స్పందించేలా చేస్తుంది. ఎమోషనల్ గా రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు కనెక్ట్ అవుతారు. ఆ స్ట్రాటజీనే ఇప్పుడు చంద్రబాబు వాడారు. ఈ తాజా పరిణామాలు చూస్తుంటే రాజకీయంగా చంద్రబాబు దూకుడు పెంచబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నుంచి ఈ రకమైన ప్రతిస్పందన ఎవరూ ఊహించి ఉండరు. చంద్రబాబు చేసిన శపథం, కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.