ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే ఈ క్రాస్ ఓటింగ్ కు కారణం చంద్రబాబు అని.. చంద్రబాబే తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని సజ్జల ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ నిర్దేశించిన అభ్యర్థికి కాకుండా టీడీపీ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడ్డాయి. దీనిపై విచారణ జరిపిన వైసీపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్టు గుర్తించారు. క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ నలుగురిలో ఇద్దరు ఎమ్మెల్యేలను వైసీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదు. కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలకు ఇద్దరికీ హైకమాండ్ ఎవరికి ఓటెయ్యాలో అనేది చెప్పలేదు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం క్యాంపులో ఓట్లు ఎలా వేయాలో సాధన చేయించి వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటాయించింది వైసీపీ పార్టీ.
కానీ వారు చివరకు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినట్లుగా వైసీపీ హైకమాండ్ గుర్తించింది. దీనిపై సీరియస్ అయిన పార్టీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. అయితే తాము ప్రత్యేక కోడ్ ఒకటి పెట్టుకున్నామని.. దాని ఆధారంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ వారిని గుర్తించి సస్పెండ్ చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగానే పార్టీని ధిక్కరించారు. వైసీపీ పార్టీ అధిష్టానం వీరికి విప్ కూడా జారీ చేయలేదు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలి అనే విషయంలో తమ విప్ ప్రసాదరాజును పలుమార్లు అడిగినప్పటికీ ఆయన చెప్పకపోవడంతో మనసు మాట విని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది.
అయితే తాను వైసీపీ అభ్యర్థికే ఓటు వేశానని ఆనం రామనారాయణ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీని వ్యతిరేకించారు. ఆయనకు కూడా ఎలాంటి విప్ జారీ చేయలేదు. దీంతో ఆయన టీడీపీ అభ్యర్థికే ఓటు వేసినట్లు స్పష్టమైంది. మరోవైపు క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై తమపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తాము క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని, తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. తమ విప్ చెప్పిన వైసీపీ అభ్యర్థికే ఓట్లు వేశామని అంటున్నారు. అయితే తాము దర్యాప్తు చేసిన తర్వాతే క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని సస్పెండ్ చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తొలిరోజే అసెంబ్లీ సమావేశాల నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇద్దరూ చివరి రోజు అసెంబ్లీకి హాజరు కాలేదు. ఈ పరిణామాలు వారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాయనడానికి ఆధారంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరు క్రాస్ ఓటింగ్ కి పాల్పడడానికి కారణం చంద్రబాబు అని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని, ఈ ఎపిసోడ్ లో భారీగా డబ్బులు మారాయని ఆరోపించారు. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కొన్నారని.. ఒక్కొక్కరికీ రూ. 15 నుంచి రూ. 20 కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. మరి సజ్జల చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.