ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు అప్పుడప్పుడు వేడిగా ఉంటాయి. ఒక్క ఏపీ పాలిటిక్స్ మాత్రమే తగ్గేదే లే అన్నంత రేంజ్ లో ఎప్పుడూ హీట్ గా ఉంటాయి. ఇప్పుడు కూడా రాష్ట్రాంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇలాంటి వార్ జరుగుతూనే ఉంది. టీడీపీ అధికారిక ప్రతినిధి పట్టాభి సీఎం విషయంలో హద్దులు మీరి మాట్లాడటం, దానికి వైసీపీ నేతలు దాడులు చేయడం, టీడీపీ ఆ దాడులను వాడుకుని దీక్ష చేయడం ఇలా ఒకదాని తరువాత మరొకటి . కానీ.., ఇక్కడే ఒక విషయాన్ని చెప్పుకోవాలి. మొత్తం ఈ రచ్చ వల్ల లాభపడుతుంది మాత్రం చంద్రబాబే అన్న టాక్ వినిపిస్తోంది.
2019 ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించనంత విజయాన్ని దక్కించుకుని, ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ కొట్టారు జగన్. ఆ తరువాత కరోనా వచ్చి అధికారంలో లేని నాయకులను ప్రజలు మర్చిపోయేలా చేసింది. ఈ సమయంలోనే చంద్రబాబు లోకేశ్ ఇంటికే పరిమితం అవ్వడంతో టీడీపీని సొంత పార్టీ వారు కూడా లైట్ తీసుకునే పరిస్థితి తలెత్తింది. నాయకులే సైలెంట్ అయిపోతే ఇక కార్యకర్తలు, పార్టీ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కానీ.., రాజకీయం అంటే అవకాశం కోసం ఓపిగ్గా కాపు కాయడమే. అనుభవశాలి చంద్రబాబు ఇలానే ఓమంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు పట్టాభి రూపంలో ఆయనకి ఓ మంచి అవకాశం దొరికింది. పట్టాభి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ ఆఫీస్ ల పై దాడి జరిగింది. మంచో, చెడో అంతా ఇప్పుడు టీడీపీ గురించి, చంద్రబాబు గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఏడాది కాలంగా నిద్రావస్థలో ఉన్న టీడీపీ అభిమానులను ఈ ఘటన మళ్ళీ పొలిటికల్ గా యాక్టీవ్ చేసింది. జనాల్లో ఇంకా టీడీపీ బలంగానే ఉంది, అందుకే వారి మీద దాడులు జరుగుతున్నాయన్న కొన్ని సంకేతాలు అయితే ప్రజల్లోకి వెళ్లిపోయాయి.
ఇక నిరవధిక దీక్షలో కూర్చొని చంద్రబాబు పార్టీకి కావాల్సిన మైలేజ్ సాధించేశారు. ఈ లెక్కన వైసీపీ నేతలే దగ్గర ఉండి టీడీపీకి మైలేజ్ పెంచినట్టు అయ్యింది. ఈ గొడవ అంతా తీసేసి చూస్తే అసలు టీడీపీ పార్టీ ఎక్కడా యాక్టివ్ అయ్యిందే లేదు. ప్రతిపక్ష పార్టీగా వారు ప్రజల దృష్టిలో పడిందే లేదు. కాబట్టి.. కోన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీని ఇప్పుడు వైసీపీ నేతలు బతికించినట్టు అయ్యిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.