గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలుండగా.. డిసెంబర్ 1, 5న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక గురువారం నాడు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే.. బీజీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక చివరకు మరోసారి గుజరాత్‌లో కమలం వికసించింది. ఇప్పటికే బీజీపీ 152 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సారి బీజేపీ ఏకంగా 54 శాతం ఓటు షేర్ సాధించి.. బంపర్ మెజార్టీ సాధించింది. ఏడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోంది.
గుజరాత్‌లో బీజేపీ గత 27 ఏళ్లుగా అధికారంలో ఉంది. తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీ సాధించి.. ఏడోసారి అధికారంలోకి రాబోతుంది. గుజరాత్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు గెలిస్తే చాలు. కానీ ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను చూస్తే.. బీజేపీ ఏకంగా 150కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. గుజరాత్‌లో 1995 నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. అయితే, గతంలో 1985 అసెంబ్లీ ఎన్నికల్లో 149 స్థానాలతో కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును మాత్రం ఇప్పటి వరకు బీజేపీ బ్రేక్ చేయలేకపోయింది. కానీ ఈ సారి ఆ రికార్డు బ్రేకవ్వడం.. లేదా దగ్గరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎత్తుకున్న భూమిపుత్ర నినాదం ఆ పార్టీకి బాగా కలసి వచ్చింది.
ఇక పురాతన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని విధంగా దెబ్బతింది. 27 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి.. ఏకంగా 60కిపైగా సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఇప్పటి వరకూ గుజరాత్‌లో ఆదివాసీ ఓట్లను ఎక్కువ మొత్తంలో దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ సారి మొండి చేయి ఎదురయ్యింది. ఇక ఆప్ రాకతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. ఆప్, ఎంఐఎం పార్టీలు.. కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చినట్లు స్పష్టమవుతోంది. అలానే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు ఏమాత్రం కలిసి రాలేదని మరోసారి రుజువయ్యింది. ప్రస్తుతానికి గుజరాత్‌లో బీజేపీ-151 స్థానాల్లో, కాంగ్రెస్-21 స్థానాల్లో, ఆప్-6 స్థానాల్లో.. ఇతరులు-5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం డిక్లేర్ అయ్యింది.