అదానీ గ్రూపు.. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీని గురించే చర్చ. అమెరికాకు చెందిన ఓ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ అదానీ గ్రూపుపై ఓ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఆ నివేదిక కారణంగా అదానీ గ్రూపు షేర్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇది పెద్ద కుంభకోణమని దీనిపై దర్యాప్తు జరగాలంటూ విపక్షాలు పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై బీజీపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. అదానీ గ్రూపు ఆస్తులు జాతీయం చేసి.. వేలం వేయాలంటూ స్పందించారు.
అదానీ గ్రూపు ఆస్తులను వెంటనే జాతీయం చేయాలి. ఆ గ్రూపు ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బుతో నష్టపోయిన వారికి సహాయం చేయాలి. అదానీతో ఒప్పందాలు లేవని, తమకి సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది. కానీ, అదానీతో ఒప్పందాలు కలిగిన కాంగ్రెస్ వ్యక్తుల గురించి నాకు తెలుసు. అయినా నేను కాంగ్రెస్ గురించి పట్టించుకోను. కానీ, బీజీపీ మాత్రం తన పవిత్రతను కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నా. అదానీ గ్రూపు వ్యవహారంలో కేంద్రం ఏమీ దాచిపెట్టడంలేదనే స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.
నేను పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతిపట్ల సానుభూతి వ్యక్తం చేస్తే విమర్శించారు. కార్గిల్ యుద్ధానికి కారణమైన వ్యక్తి మృతిపట్ల సంతాపం తెలుపుతారా అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు. కార్గిల్ యుద్ధం సమయంలో ప్రధానిగా ఉన్నది నవాజ్ షరీఫ్. అతని ఆదేశాలను ఆచరిస్తూ అప్పటి సైకికాధిపతిగా ముషారఫ్ యద్ధం చేశారు. నిబంధనలు పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ లో అడుగుపెట్టారు. కార్గిల్ యుద్ధానికి కారణమైన నవాజ్ షరీఫ్ తో కలిసి ప్రధాని మోదీ భోజనం కూడా చేశారు. నవాజ్ షరీఫ్ తో మోదీ కలవడంపై నెటిజన్లు ఎందుకు మాట్లాడటం లేదు? నవాజ్ షరీఫ్ ఇంటికి మోదీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన తర్వాత నన్ను ప్రశ్నించండి.
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కూడా బీజీపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి విమర్శలు చేశారు. నిజానికి మొదటి నుంచి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్ ను సుబ్రమణ్య స్వామి విమర్శిస్తూనే ఉన్నారు. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ఒక బోగస్ అంటూ సుబ్రమణ్య స్వామి విమర్శించారు. వచ్చే ఏడాది 6.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందనడాన్ని ఎద్దేవా చేశారు. కొన్నేళ్లుగా 3 నుంచి 4 శాతం నమోదవుతుంటే.. వచ్చే ఏడాదికి మాత్రం 6.5 ఎలా అవుతుందని ప్రశ్నించారు. వ్యవసాయం, పరిశ్రమలకు ఎలాంటి ప్రధాన్యం లేదని.. అసలు ప్రభుత్వానికి ఎలాంటి వ్యూహం లేదంటూ సుబ్రమణ్య స్వామి తీవ్రంగా స్పందించారు.