ప్రజాప్రతినిధులు, మంత్రులు అప్పుడప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా కర్ణాటక మంత్రి ఒకరు.. రాష్ట్రాలు విడిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కర్ణాటక రెండుగా విడిపోబోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల తరువాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయని తెలిపారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు తనకు తెలిసిందని అన్నారు.
కర్ణాటక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి మంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్ని సందర్భంలో పై వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కర్ణాటకలో రెండు , ఉత్తరప్రదేశ్ లో నాలుగు, మహారాష్ట్రలో మూడు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడతాయని చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు మంచిదేనన్న ఆయన.. ఉత్తర కర్ణాటక ప్రాంతం రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధిచెందాల్సి అవసరం ఉందన్నారు. అయితే కర్ణాటక రెండుగా చీలిపోతుందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. రాష్ట్రాన్ని విడగొట్టే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదన్నారు. మంత్రి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన అలా మాట్లాడడం కొత్తేమీ కాదని కొట్టిపడేశారు. రెవెన్యూ మంత్రి ఆర్. అశోకా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం అంటూ ఉమేష్ ఇప్పటి వరకు వందసార్లు మాట్లాడారని అన్నారు.
మంత్రి ఉమేశ్ వ్యాఖ్యలపై మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రధానమంత్రి స్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం మంత్రి ద్వారా బయటపడిందన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మరి.. దేశంలో కొత్త 50 రాష్ట్రాలు ఏర్పడనున్నాయి అని కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Bank Manager: యువతి మాయలో బ్యాంకు మేనేజర్.. రూ. 5.70 కోట్ల బదిలీ!