జూనియర్ యన్టీఆర్.. ప్రస్తుతం తెలుగునాట టాప్ రేంజ్ స్టార్. నందమూరి వారి ఛరీస్మా ఏ మాత్రం తగ్గకుండా, కాపాడుకుంటూ వస్తున్న వారసుడు. ఒక్క నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.., మిగతా హీరోల ఫ్యాన్స్ కి కూడా తారక్ అంటే చాలా ఇష్టం. నటనలో, డ్యాన్స్ లలో, ఫైట్స్ లో ఈ జూనియర్ రామయ్యని బీట్ చేసే హీరోలు లేరంటే అతిశయోక్తి లేదు. ఇంత స్టార్డమ్ ఉంది కాబట్టి యన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చాలా ఏళ్లుగా చర్చ నడుస్తోంది. కానీ.., తారక రాముడు మాత్రం ఈ విషయంలో మౌనంగానే ఉంటున్నాడు. నిజానికి 2009 ఎన్నికల సమయంలో జూనియర్ పార్టీకి ప్రచారం చేశాడు. కానీ.., ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు.
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభంజనం ముందు ఎవ్వరి ఎత్తుగడలు ఫలించలేదు. ఇక అప్పటి నుండి జూనియర్ ని పార్టీలో దూరం పెట్టారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక చివరి ఎన్నికల్లో కూడా తారక్.. ప్రచారానికి దూరంగానే ఉన్నాడు. ఇక.. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకి పరిమితం అయిపోయిందో, అప్పటి నుండి టీడీపీ కార్యకర్తలు జూనియర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా పార్టీ పగ్గాలు యన్టీఆర్ చేతిలోనే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు.
బాలయ్య 61వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా.. కొని మీడియా సంస్థలు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? టీడీపీ పగ్గాలు అందుకుంటారా? తారక్ టీడీపీలోకి వస్తే పార్టీకి లాభమా? నష్టమా? మీరు ఏమనుకుంటున్నారంటూ బాలకృష్ణపై ప్రశ్నల వర్షం కురిపించింది యాంకర్. వీటికి బాలకృష్ణ నుండి ఎవ్వరూ ఊహించని సమాధానాలు వచ్చాయి. “ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే దాని గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు.
ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ప్లస్ అయి, మైనస్ అయితే పరిస్థితి ఏంటి అంటూ బాలయ్య ఎదురు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఒక ఆవేశంలోంచి పుట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడూ పారదర్శకంగా ఉంటారు. అలాంటి వారికే ఈ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని బాలకృష్ణ సమాధానం ఇవ్వడం విశేషం. దీంతో.., బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్ టీడీపీలోకి రావడం బాలకృష్ణకి ఇష్టం లేదని, అందుకే ఇలాంటి కామెంట్స్ చేశారని జూనియర్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. రానున్న కాలంలో తారక్ అడుగులు ఎటువైపు పడుతాయో చూడాలి. మరి.. తారక్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.