పాదయాత్ర.. రాజకీయాల్లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఓ వ్యక్తి నాయకుడు కావాలంటే.. ప్రజల్లో తిరుగుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. నేనున్నాను అని భరోసా ఇవ్వాలి. అందుకు సరైన ఎంపిక పాదయాత్ర. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్లాట్‌పామ్ వంటివి ఎన్ని వచ్చినా సరే.. పాదయాత్రకున్న క్రేజే వేరు. తెలుగు రాజకీయాల్లో పాదయాత్ర పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వరుస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి.. తన పాదయాత్రతో జీవం పోసి.. రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చేలా చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది.
ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత.. ఏపీలో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర కూడా చరిత్రలో నిలిచిపోయింది. పాదయాత్ర పవర్ నాయకులకు అర్థం కావడంతో.. రాహుల్ మొదలు.. రేవంత్ వరకు.. నేతలంతా పాదయాత్రకు జై కొడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో యువ నేత చేరారు. ఆయనే నారా లోకేష్.
మరో ఏడాదిన్నరలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రధాన నేత.. నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. లోకేష్ పాదయాత్ర గురించి ఇప్పటికే అనేక సార్లు ప్రస్తావన వచ్చింది. కానీ ఎప్పటి నుంచి ప్రాంరభం అవుతుందనే దాని గురించి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా లోకేష్ పాదయాత్రకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.
2023, జనవరి 27 నుంచి లోకేష్.. పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్య నాయకులు బుధవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేయగా.. పేరు, రూట్ మ్యాప్, 27న ఏ సమయంలో.. ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభమవుతోంది వంటి వివరాలను బుధవారం టీడీపీ కీలక నేతలు ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా.. ఇచ్ఛాపురం వరకు 400 రోజులపాటు 4 వేల కి.మీ.ల మేర పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. యువతే టార్గెట్‌గా పాదయాత్ర సాగనుందట. అందుకే.. పాదయాత్రలో యువతకు.. అధిక ప్రాధాన్యత, భాగస్వామ్యం కల్పించాలని టీడీపీ భావిస్తోంది. లోకేష్ చేసే పాదయాత్రతో టీడీపీ కేడర్‌లో ఉత్సాహం వస్తుందని నేతలు భావిస్తున్నారు. ఈ పాదయాత్ర సుమారు 400 రోజుల పాటు కొనసాగనుంది. అంటే.. దాదాపు ఏడాది పాటు ప్రజల్లోనే ఉండేలా లోకేష్ ప్లాన్ చేసుకున్నారని అర్థం అవుతోంది. పాదయాత్రలో భాగంగా.. ఓ వైపు ప్రజలతో మమేకమవుతూనే.. అటు పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు భావిస్తున్నారు.
ఈ పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేయాలని.. మరీ ముఖ్యంగా స్థానికంగా ఉండే జనాలతో మమేకం అయ్యేలా పాదయాత్ర కార్యచరణ రూపొందిస్తున్నారట. ఇక జనవరిలో లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవుతుండగా.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనతో బిజీగా ఉన్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ.. పాదయాత్ర చేయబోతున్నారు. లోకేష్ పాదయాత్ర.. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర పేరుకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. కొంతమంది తెలుగు తమ్ముళ్లు లోకేష్ పాదయాత్ర పేరును రివీల్ చేశారు. నారా లోకేష్ చేయబోయే పాదయాత్రకు ‘ప్రజాగళం’ పేరు ఫైనల్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బుధవారం నాడు దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది. మరి పాదయాత్ర ఏపీలో టీడీపీని అధికారం పీఠం ఏక్కిస్తుందా.. లోకేష్ పాదయాత్ర వల్ల ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయని మీరు భావిస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
@naralokesh పాదయాత్ర పేరు ప్రజాగళం
400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగనున్న లోకేశ్ పాదయాత్ర
వంద నియోజకవర్గాల మీదుగా సాగనున్న ప్రజాగళం
యువత, మహిళలు, రైతు సమస్యలు ప్రతిబింబించేలా పాదయాత్ర.#ప్రజాగళం #NaraLokesh #Prajagalam #TDPWillBeBack #CBNAgain #HOPEVijayawada pic.twitter.com/dLHa65hS4W
— ITDP Vijayawada west (@ItdpWest) December 28, 2022
లోకేషన్న పాదయాత్ర పేరు “ప్రజాగళం”.
యువత నిరుద్యోగం, మహిళలు, రైతు సమస్యలు ప్రతిబింబించేలా 400 రోజులు పాదయాత్ర.#hope0121 pic.twitter.com/tu3ZSRiW3T— VIJETHA (@VijethaUK) December 28, 2022