పవన్ కల్యాణ్ సినిమా కేరీర్ లో 27 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. అలాగే రాజకీయంగా జనసేనను స్థాపించి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా దిగ్విజయభేరి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ కూడా నిర్విహంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పవన్ కల్యాణ్ రాజకీయంగా దూకుడు పెంచారు. జనసేన పార్టీని స్థాపించిన పదేళ్లు పూర్తవుతున్న వేళ పెద్దఎత్తున ఆవిర్భావ సభను నిర్విహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ సినీ ప్రస్థానం ప్రారంభమయ్యి 27 ఏళ్లు పూర్తైంది. ఈ రెండు సందర్భాలను కలిపి దిగ్విజయభేరి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఛలో మచిలీపట్నం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మార్చి 14న మచిలీపట్నం వేదికగా జనసేన పదో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మచిలీపట్నంలోని బహిరంగ సభలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ వారాహి రథంలో చేరుకుంటారని వెల్లడించారు. ఆ ర్యాలీలో వేల సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. బహిరంగ సభలో కూడా జనసేన కార్యకర్తలు, శ్రేణులు పెద్దఎత్తున పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ ఆవిర్భావ సభలో రాజకీయంగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన, నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇన్ని ప్రచారాల నేపథ్యంలో జనసేన పార్టీకి ఏపీ పోలీసులు షాకిచ్చారు.
పెద్దఎత్తున ర్యాలీగా సభకు చేరుకోవాలి అనుకున్న పవన్ కల్యాణ్ నిర్ణయానికి ఆటంకం కలిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో మార్చి 14న పోలీసు యాక్ట్ 30 అమలులో ఉన్నట్లు ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా జాతీయరహదారిపై ర్యాలీలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పోలీసుల ప్రకటనపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. తమ సభకు ఆటంకం సృష్టించాలనే దురుద్దేశంతోనే పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అడ్డుకోవానే ఇలాంటి షరతులు అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఛలో మచిలీపట్నం !
JanaSena 10th Formation Day, March 14th, 2023, Machilipatnam.#ChaloMachilipatnam pic.twitter.com/4fAwsp3dfg
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2023