ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వెలువడ్డ సంగతి అందరికీ విదితమే. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా. 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. గెలిచేందుకు తగినంత మెజార్టీ లేకపోయినప్పటికీ.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ అనూహ్యంగా విజయం సాధించారు.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డ సంగతి అందరికీ విదితమే. గెలిచేందుకు తగినంత మెజార్టీ లేకపోయినప్పటికీ.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ అనూహ్యంగా విజయం సాధించారు. గెలవడానికి 22 ఓట్లు కావాల్సి ఉన్నా, అందరి కంటే ఎక్కువగా 23 తొలి ప్రాధాన్యతా ఓట్లు తెచ్చుకోవడంతో మొదటే విజయం సాధించారు. ఈ ఫలితాలు అధికార వైసీపీకి చేదు జ్ఞాపకాలే. క్లీన్ స్వీప్ చేద్దామనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి.
వాస్తవానికి అసెంబ్లీలో టీడీపీ బలం 23 అయినా.. అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా మిగిలింది 19 మందే. అలాంటిది పంచుమర్తి అనూరాధకు 23 ఓట్లు పడ్డాయి. అంటే.. నాలుగు ఓట్లు ఎక్కువ. ఇక్కడ అధికార పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైంది. ఇందులో రెండు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిల ఓట్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి టీడీపీకి ఓటేసిన మరో ఇద్దరు ఎవరన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ విషయంపై అధికార పార్టీ నేతలు స్పందిస్తూ.. పార్టీకి నమ్మకద్రోహం చేసిందెవరో తేటతెల్లమైందని చెప్తున్నా వారి పేర్లు బయటకు చెప్పకపోవటం గమనార్హం.
ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ సంఖ్యా బలం 151. దీనికి టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురు(కరణం బలరామకృష్ణమూర్తి, మద్దాళి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్), జనసేన ఎమ్మెల్యే ఒకరు(రాపాక వరప్రసాద్) కలుపుకుంటే.. 156. అంటే 7 ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయవచ్చు. కానీ, అది సాధ్యపడలేదు. పార్టీలో నమ్మకంగా ఉంటూనే ప్రతిపక్ష టీడీపీకి ఓటేశారు.. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు. దీంతో కోలా గురువులు ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఓటమిని వెనుకుండి శాసించిన మరో ఇద్దరు ఎవరన్నది తేలాల్సి ఉంది. కోలా గురువులు, జయ మంగళం వెంకటరమణకు కేటాయించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తేలడంతో.. ఇప్పుడు వారికి కేటాయించిన ఎమ్మెల్యేలందరిపై వైసీపీ హైకమాండ్ అనుమానపడే అవకాశం ఉంది.
కోలా గురువులు ఓటమికి ప్రధాన కారణం.. అధిష్టానం ముందుచూపు లేకపోవడమే అంటున్నారు.. రాజకీయ నిపుణులు. ఇందులో ఇంటెలిజన్స్ అధికారుల వైఫల్యం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే.. గత మూడు రోజులగా పార్టీ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడుతున్నా.. అసమ్మతి నేతలను ఎందుకు పార్టీ పెద్దలు గుర్తించలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకముందే..? ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లినా.. ఎందుకు ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయిందనే చర్చ జరుగుతోంది. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో తెలియాలి. ఇప్పటికైనా రెబెల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా..! అన్నది తెలియాల్సి ఉంది.