ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నాడు అనగా మార్చి 13న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ గురువారం ప్రారంభం అయ్యింది. అధికార వైసీపీ ముందంజలో ఉంది. ఇక కర్నూలులో వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లో 9 ఎమ్మెల్సీ సీట్లకు కౌంటింగ్ మొదలైంది. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు ఎన్నికల సిబ్బంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కనపెట్టారు. ఆపై పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఇక కర్నూలు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 49 మంది పోటీ చేశారు. విశాఖ గ్రాడ్యుయేట్ స్థానంలో 37 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 22 మంది పోటీ పడ్డారు. కడప, అనంతపురం, కర్నూలు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది పోటీలో ఉన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటికే కర్నూలు, శ్రీకాకుళం ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ గెలుపొందారు. అనుకున్న ఓట్లు కంటే వైసీపీకి అదనంగా 50 ఓట్లు వచ్చాయి. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలవ్వగా.. 1083 ఓట్లు మాత్రమే చెల్లినవిగా సిబ్బంది పరిగణించారు.
ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 542 ఎవరికి వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు ఎన్నికల అధికారులు. అయితే, వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌కి పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో.. ఎన్నికల సిబ్బంది ఆయనను విజేతగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి ఈ ఫలితాలపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.