ఏపీలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. శుక్రవారం చంద్రబాబు లైవ్ లో కన్నీరు పెట్టుకున్న విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఖండిస్తున్నారు. మంత్రి పేర్ని నాని కూడా ఆ విషయాన్ని ఖండించారు. ‘అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబాన్ని, ఆయన సతీమణిని ఎవరూ ఏమీ అనలేదు. అసలు వారి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అదంతా చంద్రబాబు క్రియేట్ చేసిన ఒక మెలోడి డ్రామా’ అంటూ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు.
‘బాలకృష్ణ ఒక అమాయక చక్రవర్తి.. కానీ చంద్రబాబు ఏం చెప్తే అదే నమ్ముతారు. అందరి ఇళ్లల్లో ఆడవాళ్లు ఉన్నారు. మేమెందుకు తిడతాం.. అసెంబ్లీలో వ్యవసాయం గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఒక్క ప్రశ్నైనా అడిగారా?. అంటూ పేర్నినాని ప్రశ్నించారు. నిజంగానే శుక్రవారం ఏపీ రాజకీయాల్లో ఒక బ్లాక్ డే అంటూ పేర్నినాని అభివర్ణించారు. ‘రాష్ట్రంలో అందరూ కొవ్వొత్తులు తీసుకుని నిరసన తెలపాలని చెప్తున్నారు. ఎందుకు నిరసన చేయాలి. ఏం సాధించారని నిరసన చేయాలి. రైతులు సాధించిన విజయానికి ప్రతీకగా వైసీపీ శనివారం కొవ్వొత్తుల ర్యాలీ చేస్తేంది. రైతులు దాదాపు సంవత్సరం పాటు పట్టుబట్టి కేంద్రాన్ని దిగొచ్చేలా చేశారు. మీరు ఎందుకు కొవ్వొత్తులతో నిరసన చేయాలి?’ అంటూ పేర్నినాని సూటిగా ప్రశ్నించారు.
‘అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి అందరి దగ్గరా వీడియో ఉంది. ఒకసారి పరిశీలించండి. వైసీపీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని పలచన చేయాలని కుట్రపూరిత రాజకీయ క్రీడకు తెరతీశారు. ప్రశాంతమైన వాతావరణంలో వ్యవసాయ అంశాలపై చర్చ జరుగుతోంది. జగన్, ఆయన కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఇలాంటి పనుల వల్ల రాష్ట్ర రాజకీయాలను ఎలాంటి పరిస్థితులకు తీసుకుని వెళ్తున్నారు’’ అని మంత్రి ప్రశ్నించారు.