ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) సోమవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఇక ఎంతో ఆరోగ్యంగా ఉండే గౌతమ్ రెడ్డి ఇంత హఠాత్తుగా మృతి చెందడాన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు, అభిమానులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అంతేకాక గౌతమ్ రెడ్డి తన ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తారు. అలాంటి వ్యక్తి ఇంత సడెన్ గా గుండెపోటుతో మరణించడం ఏంటని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం.. మేకపాటికి ఇప్పటికే రెండుసార్లు కరోనా వచ్చిందని.. పోస్ట్ కొవిడ్ లక్షణాల వల్లే ఆయనకు ఇంత సడెన్ గా గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక మేకపాటి గౌతం రెడ్డికి రాజకీయాల్లో చాలా మృదుస్వభావిగా మంచి పేరుంది. ప్రత్యర్థి పార్టీల వారు ఎంతగా రెచ్చగొట్టేలా మాట్లాడినా మేకపాటి మాత్రం సున్నితంగా స్పందించేవారు. అందరితో చాలా సన్నిహితంగా ఉంటారని తోటి నాయకులు చెబుతూ ఉంటారు. మేకపాటి గౌతం రెడ్డి చనిపోయిన వార్తను తెలుసుకొని వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతి చెందారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు నాయకులు అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు.