ఫిబ్రవరి 11వ తేదీ నుంచి హైదరాబాద్ లో అంతర్జాతీయ ఈ-రేసింగ్ పోటీలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పోటీలు ఏపీలో ఎప్పుడు ప్రారంభమవుతాయనే ప్రశ్నకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచిత్రమైన సమాధానం చెప్పారు.
ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏదో ఒక విషయంలో పోలికలు వస్తూనే ఉంటాయి. ఇక హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఈ-రేసింగ్ విషయంలో కూడా ఇలాంటి చర్చ వచ్చింది. ఇంత పెద్ద ఈవెంట్ కి హైదరాబాద్ వేదిక అయిన విషయం తెలిసిందే. మరి.. ఏపీ ఇలాంటి పోటీలు నిర్వహించేందుకు ఎన్నాళ్ళు పడుతుందో అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే ప్రశ్న ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఎదురవ్వగా.. ఆయన కాస్త విచిత్రంగా సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్ అంతర్జాతీయ ఈ-రేసింగ్ కి వేదిక అవ్వడంపై మంత్రి అమర్నాథ్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు. ” హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా నిలవడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఈరోజు ఇంతటి ఖ్యాతిని కలిగిన హైదరాబాద్ నగరం.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డెవలప్ అయిన ప్రాంతం. అయినా.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. ఇక మీరు అడిగినట్టు ఏపీలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది..అది పెట్ట కావడానికి టైం పడుతుంది. రానున్న కాలంలో కచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తాము. హైదరాబాద్ లానే ఏపీలో వైజాగ్ ని డెవలప్ చేస్తాము” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
నిజానికి గతకొంత కాలంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏ కామెంట్స్ చేసినా.. వాటిని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి చెప్పిన మాటల్లో అసలు విషయాన్ని వదిలేసి.. ఆయన ఉదాహరణగా చెప్పిన కోడి, గుడ్డు మాటలని హైలెట్ చేస్తూ ట్రోల్స్ కి దిగారు. అప్పట్లో ప్రత్యేక పరిస్థితుల నడుమ.. ఏపీ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. అలాంటి రాష్ట్రంలో అప్పుడే రేసింగ్ ఎలా సాధ్యం? రానున్న కాలంలో ఆ దిశగా అభివృద్ధి చేస్తామన్నది అమర్నాథ్ మాటల్లో అర్ధం అంటూ కొంతమంది మంత్రికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.