తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట మహా పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు.. 4000 కిలోమీటర్లు పర్యటించనున్నారు. కుప్పుం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. లోకేష్ పాదయాత్రకు జనాలు భారీగా తరలిస వస్తున్నారు. యువత, నిరుద్యోగం, రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర చూసి వైసీపీ భయపడుతోందని.. పాదయాత్రకు స్పందన రాకూడదనే ఉద్దేశంతోనే.. రోడ్ల మీద బహిరంగ సభలు నిషేదించారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా ఏపీ హోం మినిస్టర్ తానేటి వనిత సుమన్ టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించారు.
సుమన్‌టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తానేటి వనిత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం, టీడీపీ, జనసేన పొత్తుపై స్పందించారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రకు వస్తోన్న స్పందన చూసి వైసీపీ భయపడుతుంది నిజమేనా అంటూ యాంకర్ వనితను ప్రశ్నించారు. అందుకు ఆమె సమాధానం చెబుతూ.. ‘‘లోకేష్ పాదయాత్ర ఏముందని ఒణికిపోవడానికి.. పెయిడ్ ఆర్టిస్ట్‌లను చూసి భయపడాల్సిన పని మాకు లేదు. టీడీపీ నేతలు ఏదో డబ్బులిచ్చి జనాలను తీసుకువచ్చి మాట్లాడాలించాలని భావించినా.. చివరకు దేవుడు వారి నోట ఏం పలికించాలో అదే పలికిస్తారు. ఇందుకు నిదర్శనం నిన్న లోకేష్ మీటింగ్‌లో జరిగిన సంఘటన. ఓ అమ్మాయి అంతసేపు మాట్లాడి చివరకు జై జగన్ అన్నది. అది చాలు కదా. ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ఇదే మాట’’ అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా వైసీపీ మీటింగ్‌లకు జనాలు వస్తే అభిమానం.. టీడీపీకి వస్తే పెయిడ్ ఆర్టిస్టులు అనడం ఎంత వరకు కరెక్ట్ అన్న యాంకర్ ప్రశ్నకు తానేటి వనిత స్పందిస్తూ.. ‘‘నిన్న లోకేష్ పాదయాత్రలో ఒకమ్మాయిని మాట్లాడించారు. ఆ అమ్మాయి నిజంగా టీడీపీ కార్యకర్త అయ్యుంటే.. లోకేష్ గురించే మాట్లాడాలి. కానీ ఆ అమ్మాయి జగనన్న గురించి ఎందుకు మాట్లాడింది.. అంటే ఆ అమ్మాయి బలహీనతను వీళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. టీడీపీకి ఆ అలవాటు ఉంది.. అందుకు తగ్గ మనుషులు వాళ్ల దగ్గర ఉన్నారు. అందుకే మేం పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటున్నాం’’ అన్నారు తానేటి వనిత. మరి ఏపీ హోం మినిస్టర్ చేసిన కామెంట్స్‌తో మీరు ఏకీభవిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.