మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై హైకోర్టులో అడ్వకేట్ జనరల్ మెమో దాఖలు చేయనున్నారు. పూర్తి వివరాలను సీఎం జగన్ స్వయంగా ప్రకటిస్తారని వెల్లడించారు. అయితే.., ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న జగన్ సర్కార్ నెక్ట్స్ స్టెప్ ఏంటి? అమరావతినే కొనసాగిస్తారా? లేక విశాఖనే పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటిస్తారా? ఈ విషయంలో సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ ఏమిటి అన్న క్యాలిక్యులేషన్స్ అప్పుడే మొదలయి పోయాయి. కానీ.., కాస్త లోతుగా అధ్యయనం చేస్తే కొత్త బిల్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూడు రాజధానుల బిల్లు పై హైకోర్టు స్టే విధించడానికి ప్రధాన కారణం.. అందులో న్యాయపరమైన చిక్కులు ఉండటమే. ఇప్పుడు జగన్ సర్కారు ముందున్న తొలి ఆప్షన్ కూడా ఇదే. ఈసారి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఈసారి పకడ్బందీగా 3 రాజధానులకు అనుకూలంగా మరో కొత్త బిల్లును ప్రవేశపెట్టడం. ఇదే జరిగితే సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గనట్టు అవుతుంది.
ఏపీ ప్రభుత్వం ముందున్న రెండో ఆప్షన్ కాస్త సున్నితమైనది. టెక్నకల్ గా అసలు 3 రాజధానుల పేరునే ప్రస్తావించకుండా.. జగన్ ప్రభుత్వానికి నచ్చిన చోట, నచ్చిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్లడం. అదే వాళ్లు మొదటి నుంచి చెప్తున్న అభివృద్ధి వికేంద్రీకరణను.. మాటల్లో చెప్పకుండా, చేతల్లో చేసుకుంటూ వెళ్లిపోవడం. కానీ.., ఇక్కడ ప్రధానంగా రాజధాని ఏది అన్న విషయంలో ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతూ వస్తుంది. ఇది కాస్త సెంటిమెంట్ కి కూడా సంబంధించిన అంశం కాబట్టి.. ఏపీ సర్కారు ఈ ఆప్షన్ ని ఎన్నుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.
ప్రభుత్వం ముందున్న మూడో ఆప్షన్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేదే. అదేమిటంటే పూర్తి స్థాయి రాజధానిగా అమరావతినే కొనసాగించడం. ఇదే గనుక జరిగితే మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నూటికి నూరుపాళ్లు వెనక్కి తగ్గినట్టే. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటిస్తే రాజధాని నిర్మాణం కోసం సర్కారుపై ఆర్థికంగా ఎంతో భారం పడే అవకాశాలు ఉన్నాయి. అమరావతిలో ఇప్పటివరకు ఉన్నవన్నీ తాత్కాలిక భవనాలే కాబట్టి.. అంతా మొదటి నుంచి నిర్మాణం జరగాలి. ఇప్పటికే అప్పుల భారంతో ఉన్న ప్రభుత్వానికి.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్త రాజధాని నిర్మాణం అంటే పెద్ద భారమే అవుతుంది. కానీ..,
అమరావతి లాంటి ప్రపంచ స్థాయి రాజధానిని కష్టపడి పూర్తి చేయగలిగితే దీర్ఘకాలంలో చాలా లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులను సులభంగా ఆకర్షించవచ్చు.
ప్రభుత్వం ముందున్న చివరి ఆప్షన్, ప్రధానమైన ఆప్షన్.. పూర్తిస్థాయి రాజధానిగా విశాఖను ఎంచుకోవడం. ఒకవేళ ఏపీ ప్రభుత్వం గనుక ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో కాస్త పొలిటికల్ హీట్ మొదలవ్వడం గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. కానీ.., ఇక్కడ గతంలో సీఎం జగన్ చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని పేరుతో అభివృద్ధి అంతా ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వడం తనకి ఇష్టం లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఆ మాటలను బట్టి చూస్తే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఆప్షన్ కిసెలక్ట్ చేసుకోరు అనే అనుకోవాలి. మరి.. ఈ నాలుగు ఆప్షన్స్ లో కొత్త బిల్లులో ఏముంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.