ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. బుధవారం నంద్యాల పోలీసులు భూమా అఖిలప్రియను అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనకు సంబంధించి నంద్యాల పోలీసులు.. భూమా అఖిల ప్రియ, ఆమె సహచరులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భూమా అఖిల ప్రియను నంద్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరులు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కింద పడిన సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు పిడిగుద్దులు కురిపించారు.
మంగళవారం కొత్తపల్లి వద్ద అఖిల ప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అఖిల ప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మద్య ఎంతో కాలం నుంచి వర్గపోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు. అయితే నాగిరెడ్డి మరణం తరువాత ఈ పరిస్థితులు మారాయి. వీరిద్దరు వర్గాలుగా విడిపోయి విమర్శలు..ప్రతి విమర్శలు చేసుకుంటూ, దాడులకు దిగుతున్నారు. ఇలా ఉండగా.. కర్నూలు జిల్లాలో టీడీపీ అగ్రనేత లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుండగా ఈ రెండు వర్గాల మధ్యా విభేధాలు రచ్చకెక్కాయి. తాజాగా కొట్టుకునేవరకు వెళ్ళాయి.
ఈ క్రమంలో భూమా అఖిల ప్రియ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఏవీ సుబ్బారెడ్డిపై తిరగబడ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డికి గాయాలు కావటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నంద్యాల పోలీసులు అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులను కూడా అరెస్ట్ చేశారు. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే ఇలా జరగడం టీడీపీ వర్గాల్లో గందరగోళం నెలకొంది.