ఏపీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు కొన్ని విప్లవాత్మకంగా ఉంటాయి. ఈయన చర్యలు ఊహాతీతం అని ఊరికే అనలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అదొక చర్చ అవుతుంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో పార్లే ఫర్ ది ఓషన్స్ (Parley for the Oceans) సంస్థతో ఎంవోయు (Memorandum Of Undestandig) సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
శుక్రవారం ఉదయం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలీ వరకూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను వాలంటీర్లు క్లీన్ చేశారని, ప్రపంచంలోనే అతి పెద్ద బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ జరిగిందని అన్నారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్ర తీరం నుంచి తొలగించారని అన్నారు. మనకి 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తుందని, అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలని, ఏపీ సముద్ర తీరాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అని అన్నారు.
ఇక పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీసి, వాటిని రీసైకిల్ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ప్లాస్టిక్ నుంచి రీసైక్లింగ్ చేసిన షూస్, కళ్లజోడు ధరించి చూపించారు. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని ఆయన ప్రకటించారు. ఇక కారులో వచ్చేటప్పుడు తన ఫ్లెక్సీలే ఎక్కువగా కనిపించాయని.. వెంటనే కలెక్టర్‌తో తప్పు కదా అని అన్నానని జగన్ అన్నారు. ప్రోగ్రామే ప్లాస్టిక్ మీద జరుగుతుంది, నా ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. కరెక్ట్ కాదు కదా, రాంగ్ మెసేజ్ పోతుంది కదా అని కలెక్టర్‌తో అన్నానని ఆయన వెల్లడించారు.
దీంతో కలెక్టర్ జాగ్రత్తలు తీసుకుని ఫ్లెక్సీలను ప్లాస్టిక్‌తో కాకుండా బట్టతో చేయించినట్టు జగన్ తెలిపారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ అయితే రూ. 8 అవుతుంది, అదే బట్టతో చేస్తే రూ. 32 అవుతుంది. కొంచెం ఖర్చు ఎక్కువైనా గానీ అదే పెట్టించామని కలెక్టర్ జగన్‌తో అన్నారట. దీంతో జగన్ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఫ్లెక్సీలు పెట్టుకోవాలంటే రేటెక్కువైనా పర్లేదు బట్టతో చేయించుకోండి అని అన్నారు. మార్పు రావాలంటే మన నుండే మొదలవ్వాలి అని అంటారు. అలా తన నుండే మార్పుని మొదలుపెట్టిన జగన్‌పై, ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.